తాడిపండు రుచులు.. అందులో పోషకాలు


Ens Balu
95
Visakhapatnam
2022-08-25 14:23:57

పండుతో వంటకాలు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని దాని రుచి మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగని ఇదేదో పెద్ద ఖరీదైన పండు కాదండోయ్. విదేశాలనుండి  వచ్చింది కూడా కాదు. మార్కెట్లో పెద్దగా లభ్యమయ్యేది కాదు. చెట్టు నుంచి పండిన తర్వాత సహజంగానే కింద పడుతుంది. ఆ పండు ఎంతో రుచిగా ఉంటుంది. ఆ పండుతో తయారు చేసిన వంటకాలు కూడా ఆరోగ్యంగానూ, రుచికరంగానూ ఉంటాయి. అదే తాటి పండు. మానవాళికి తాటి సంపద ఎంతో ప్రయోజనకరమైంది.ముంజెలు, పండ్లు,తేగలు ఇలా అన్ని విధాలుగాను మనకు ఉపయోగపడుతుంది.  మూడు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ తాటిపండుతో కడుపునింపుకునే వారు.నేరుగా కొందరు, వేడి చేసుకుని మరికొందరు ఈ పండును తినేవారు. అయితే చేతికి,మూతికి అంటుకుంటుందని క్రమేపీ దూరం పెడుతూ వస్తున్నారు. ప్రస్తుత సీజన్లో లభ్యమయ్యే తాటి పండు గురించి తెలుసుకుంటే ఇది ఎన్నో పోషకాలు కలిగినది. ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడనది.ముగ్గడానికి రసాయనాలు వినియోగించనది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుతో తయారు చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ తాటి పండు గుజ్జు నుంచి తయారు చేసే గారెలు, బూరెలు, ఇడ్లీలు,దిబ్బరొట్టెలు  వంటి ఎన్నో వంటకాలు రుచిచూడడానికి పోటీ పడుతున్నారు.
‌ తాటిపండ్లన్నీ ఉచితమే...
‌‌ఇప్పుడు ఉచితంగా దొరికే పండు ఏదైనా ఉందంటే అది తాటిపండే.పల్లెల్లో ఉండే తాటిచెట్లు కింది ఇవి చెట్టుపై నుంచి పడి ఉంటాయి. రైతులు వీటిని ఉచితంగానే ఇస్తారు. అయితే వాటిని ఏరుకుని కొందరు పట్టణాలకు తీసుకెళ్లి ఇరవై నుంచి నలభై రూపాయలకు అమ్ముతారు. మీకు ఈ పండ్లు ఎక్కడైనా కనబడితే కొనకపోయినా ఒక్కసారి పట్టుకుని వాసన చూడండి ఎంత నేచురల్ గా ఉంటుందో మీకే తెలుస్తోంది. ఇక వాటితో వంటకాలు చేస్తే చుట్టుప్రక్కల వాళ్లందరకీ సువాసనలు గుప్ మంటాయి.ఇక ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
ఆరోగ్యానికి ఎంతో మంచిది..‌
‌తాడిపండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఎ,సి విటమిన్లు ఉంటాయి. బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువ పీచుపదార్ధాలు ఉండటం వల్ల జీర్ణకోశ వ్యాధులు, మలబద్ధకం దూరమవుతాయి.రక్తశుద్ది చేయడం, మెదడుకు గ్లూకోజ్ అందించడానికి దోహదపడుతుంది. నేటి తరం వారికి ఈ తాటిపండు విలువ తెలియదుకాని ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిన పండు.ఇప్పటికే తాటిచెట్లు కనుమరుగై పోతున్నాయి. భవిష్యత్తులో ఈ చెట్ల ఉనికికే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ తాటిసంపదను కాపాడుకోవాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది.