మిల్ మేకర్ మంచూరియా తింటే వదిలేదెలే


Ens Balu
61
Visakhapatnam
2022-08-28 14:13:28

మిల్ మేకర్ మంచూరియా..ఏంటి ఈ రెసిపీ పేరే వెరైటీగా ఉందే అనుకుంటున్నారా.. ఆరోగ్యవంతమైన ఫాస్ట్ ఫుడ్స్ పేర్లు, రుచి ఒక్కోసారి అలానే అపినిస్తాయి. పిల్లలకి రకరకాల జంక్ ఫుడ్ బేకరీల నుంచి తెచ్చి పెట్టి వారి ఆరోగ్యం పాడు చేసేకంటే..చక్కగా ఇంట్లోనే మేము చెప్పిన టిప్స్ పాటించి ఈ మిల్ మేకర్ మంచూరియా చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తాయి. రక రకాల రంగులు వేసి బయట తినే ఫాస్ట్ ఫుడ్ కంటే..సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్ లోనే, అదే టేస్ట్ తో  మీరు కూడా ఇంట్లోనే చాలా చక్కగా ఈ మిల్ మేకర్ మంచూరియాను చేసుకొని సాయంత్రం సమయంలో నీట్ గా ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు ఎప్పుడైనా షడెన్ గా అతిథులు ఇంటికి  వచ్చినపుడు కూడా అతి తక్కువ సమయంలో ఈ రెసిపీని చేసి వారికి కూడా రుచి చూపించవచ్చు. ఇంకెందకు ఆలస్యం ఈ మిల్ మేకర్ మంచూరిని ఎలా తయారు చేయాలి..దానికి కావాల్సిన పదార్ధాలేంటి.ఒక్కసారి తెలుసుకుందాం రండి.

మిల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన పదార్ధాలు
మిల్ మేకర్ 100 గ్రాములు, ఒక క్యాప్సికమ్, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా ఉల్లికాడలు, ఐదు టీ స్పూన్ల కాన్ ఫ్లోర్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా,  అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ ఇది పూర్తిగా ఆప్షనల్, కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు, కొద్దిగా అల్లం తరుగు, మరికొద్దిగా వెల్లుల్లి తరుగు, సోయాసాస్, చిల్లీచాస్, టమాటా సాస్, వెనిగర్ లేదా నిమ్మరసం. కాన్ ఫ్లోర్ వాటర్, మంచూరియా ఫ్రైకి తగ్గట్టుగా నూనె.

తయారుచేసే విధానం తెలుసుకుంటే..
ముందుగా మిల్ మేకర్ ను వేడిగా సలసల లాడే నీటిలో కొద్దిగా ఉప్పువేసి ఒక్క రెండు మూడు నిమిషాలు నానబెట్టాలి. బాగా నానిన మిల్ మేకర్ ను గట్టిగా నీరుపిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కొత్తిమీర తరుగు, మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత అందులోకి సరిపడ కాన్ ఫ్లోర్ వేసి మిల్ మేకర్ ని కూడా లుపుకోవాలి. ఆపై అన్నింటినీ గట్టిగా పిసికి పిసిక పక్కన పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ వెలిగించుకొని బాగా మేరినేట్ అయిన మిల్ మేకర్ ను నూనెలో దోరగా రంగు వచ్చేలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడి నుంచే కాస్త జాగ్రత్తగా ఫాలో కావాల్సి వుంటుంది. మళ్లీ కడాయి స్టవ్ పై పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి అందులో కరివేపాకు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేపాలి. అలా వేగి సమయంలోనే రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం, ఉప్పు, క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్లీ దోరగా వేయించాలి. ఆపై రెండు స్పూన్ల సోయాసాస్, మూడు స్పూన్ల చిల్లీసాస్, నాలుగు టీ స్పూన్ల టమాటా సాస్ వేసుకొని కొద్ది సేపు వేపుకోవాలి. అనంతరం అందులో ఒక గ్లాసుడు నీళ్లుపోసి సల సలా మరగుగుతుండగా ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ ను అందులో వేసుకోని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. పోసిన నీరు ఇంకిపోతుందనే లోపు ఒక టీస్పూన్ కాన్ ఫ్లోర్ వాటర్ అందులో వేసుకుంటే కాస్త జ్యూసీగా వస్తుంది. ఆపై కొత్తమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకొని ఆఖరిగా నిమ్మరసం లేదా వెనిగర్ ను వేసుకొని దించేసుకోవాలి. అందులోకి స్టఫింగ్ గా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే మిల్ మేకర్ మంచూరియా అయిపోయినట్టే. ఇక్కడ గుర్తించుకోవాల్సిందేమిటంటే..సరైన సమయంలో మనం స్టవ్ పై బాండీ పెట్టి వేపుకునేటపుడు ఏ ఒక్కటీ మాడిపోకుండా చూసుకోవాలి..వేసే మసాలాలు అన్నీ రుచికి తగ్గట్టుగానే వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ మంచూరియా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీరూ కూడా ఒక్కసారి ట్రైచేసి మీకు ఎలా కుదిరిందో మీ మా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ న్యూస్ యాప్ లేదా.. www.enslive.net వెబ్ సైట్ లో కామెంట్ చేయండి.. మరిన్ని రెసిపీల కోసం వెంటనే గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి..!