పారా అథ్లెట్ల గుర్తింపునకు ప్రత్యేక క్రుషి..


Ens Balu
14
Kakinada
2022-08-27 07:33:06

విభిన్న ప్ర‌తిభావంతులైన క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు కృషిచేయ‌నున్న‌ట్లు కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. శ‌నివారం కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్‌, జాతీయ క్రీడా దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఆశ్ర‌య జిల్లా విక‌లాంగుల స‌మాఖ్య‌, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏపీ స్టేట్ పారా అథ్లెటిక్స్ ఛాంపియ‌న్‌షిప్ పోటీల‌ను క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన క్రీడాకారులు, షాట్‌పుట్‌, లాంగ్ జంప్‌, హై జంప్ వంటి ప‌ది క్రీడాంశాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ విభిన్న ప్ర‌తిభావంతులైన క్రీడాకారులు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు, ప్రోత్స‌హించేందుకు జిల్లా అధికార యంత్రాంగం త‌ర‌ఫున అన్ని విధాల స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక‌పై జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) మైదానంలో పారా అథ్లెట్ల‌కు ఉచితంగా స‌భ్య‌త్వం, ప్రాక్టీస్‌కు వీలుక‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విభిన్న ప్ర‌తిభావంతుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఇంత మంచి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంద‌ని.. పోటీల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించిన రోట‌రీ క్ల‌బ్‌, ల‌య‌న్స్ క్ల‌బ్‌, ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్ త‌దిత‌ర సంస్థ‌లకు ధన్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

 ఇప్ప‌టికే జిల్లా నుంచి కొంద‌రు పారా అథ్లెట్లు జాతీయ‌స్థాయి పోటీల్లో పాల్గొని, బంగారు ప‌త‌కాలు సైతం సాధించార‌ని.. మ‌రింత మందిని గుర్తించి, వారు జాతీయ‌, అంత‌ర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్స‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా తొలుత నిర్వ‌హించిన షాట్ పుట్ పోటీల్లో విజేత‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ప‌త‌కాలు అంద‌జేశారు. ఈ పోటీల్లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన వారు జాతీయ స్థాయి పోటీల‌కు వెళ్ల‌నున్నారు. విజేత‌లు కార్య‌క్ర‌మంలో సెట్రాజ్ సీఈవో డీఎస్ సునీత‌, ఆశ్ర‌య జిల్లా వికలాంగుల స‌మాఖ్య అధ్య‌క్షులు పి.సురేశ్ కుమార్‌, ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ జి.కోటేశ్వ‌ర‌రావు, సెక్ర‌ట‌రీ రామ‌స్వామి; జిల్లా విభిన్న ప్ర‌తిభావంతులు, హిజ్రాలు, వ‌యో వృద్ధుల సంక్షేమ శాఖ స‌హాయ సంచాల‌కులు వాడ్రేవు కామ‌రాజు, డీఎస్ఏ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్ కుమార్‌, రోట‌రీ క్ల‌బ్‌, ల‌య‌న్స్ క్ల‌బ్‌, ఓఎన్‌జీసీ, కేఎస్‌పీఎల్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.