ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు ఎంపిక పోటీలు


Ens Balu
14
2022-10-13 15:10:55

పార్వతీపురం మన్యం జిల్లాలో 42వ జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ కు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా క్రీడల చీఫ్ కోచ్  ఎస్.వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ బాలురు, బాలికలు, ఇండియన్ రౌండ్, రికర్వ్ , కాంపౌండ్ పోటీలకు ఎంపికను పార్వతీపురంలో చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. అక్టోబర్ 17 నుండి 19 వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా అర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో  విజయనగరం జిల్లా అర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా అర్చరీ అకాడమీ సంయుక్తంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని అన్నారు. ఇందులో ఎంపిక అయిన వారు నవంబర్ 3 నుండి 12 వరకు గోవాలో ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఎఎఐ నిబంధనల మేరకు ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. 

పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు వెంటనే ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, అర్చరీ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తో జిల్లా క్రీడల అథారిటీలో నమోదు చేసుకోవాలని అన్నారు. అర్చరీ  ఛాంపియన్ షిప్ లో పాల్గొనే క్రీడాకారులు రూ.1500 ఎంట్రీ ఫీజు చెల్లించాలని తెలిపారు. క్రీడాకారులు జనవరి 2002 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు.  అర్చరీ లో పాల్గొనే అభ్యర్థులు తప్పని సరిగా జిల్లా అర్చరీ అసోసియేషన్ లో నమోదు చేసుకొని ఉండాలని ఆయన వివరించారు. నమోదు పొందని క్రీడాకారులు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాల నుండి ప్రతి ఈవెంట్ లో 6గురు బాలురు, 6గురు బాలికలు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 17న ఇండియన్ రౌండ్, 18 న రికర్వ్,19న కాంపౌండ్ పోటీలకు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిక జరుగుతుందని ఆ ప్రకటనలో  వివరించారు.