క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఎం.ఓ.యు..
Ens Balu
7
Srikakulam
2020-12-23 13:48:08
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ – జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ (జిల్లా స్పోర్ట్సు అథారిటి) మధ్య బుధ వారం మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగు (ఎం.ఓ.యు) జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎం.ఓ.యుపై జిల్లా క్రీడాప్రాధికార సంస్ధ తరపున అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జె నివాస్ సంతకం చేయగా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏ.సి.ఏ) తరపున జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జె.వి.భాస్కర రావు సంతకం చేసి ఎం.ఓ.యు పత్రాలను అందజేసుకున్నారు. ఈ మేరకు ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్దగల 7.66 ఎకరాల విస్తీర్ణం గల ఎన్.టి.ఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో అన్ని వసతులతో క్రికెట్ స్టేడియంను నిర్మించేందుకు ఏ.సి.ఏకు అందజేశారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా క్రీడా చరిత్రలో శుభ దినం అన్నారు. ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్ద అన్ని సౌకర్యాలతో గల స్టేడియంను క్రికెట్, ఇతర క్రీడలకు అనుగుణంగా నిర్మిస్తారని ఆయన పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం జగ్గు శాస్త్రులపేట స్టేడియంను ఏ.సి.ఏకు అప్పగించుటకు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. ఉత్తమ స్టేడియం రావాలని, ఇతరులకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.
జిల్లా బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రోజునే హోదా కాదు బాధ్యతతో పనిచేస్తానని తెలియజేసానన్నారు. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చుటకు కృషిలో భాగంగా, జిల్లా క్రికెట్ బృందం క్రీడాకారునిగా క్రికెట్ స్టేడియం నెలకొల్పుటకు సంకల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమదాలవలస మండలం జగ్గు శాస్త్రులపేట వద్దగల 7.66 ఎకరాల విస్తీర్ణం గల ఎన్.టి.ఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఏ.సి.ఏకు మంజూరు చేయడం జరిగిందని పేర్కొంటూ క్రీడాభిమానిగా ఉన్న రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వలన ఇది సాధ్యం అయిందన్నారు. క్రీడలకు మంచి ప్రోత్సాహాన్ని సి.యం అందిస్తున్నారని చెప్పారు. ఏ.సి.ఏకు స్టేడియం మంజూరుకు కెబినెట్ లో సహకరించిన రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజులతో సహా రాష్ట్ర శాసన సభాపతికి కృతజ్ఞతలు తెలిపారు.
30 సంవత్సరాలపాటు లీజుకు స్టేడియంను కేటాయించారని, దానిని ఎనిమిది నెలల్లో నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభించి, స్టేడియం ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. స్టేడియంలో క్రికెట్ తోపాటు వాలీ బాల్ ఇతర క్రీడలకు సౌకర్యాలు కల్పిస్తామని చిరంజీవి నాగ్ తెలిపారు. శ్రీకాకుళం నుండి స్టేడియం తరలిపోతుందనేది వాస్తవం కాదని తేల్చి చెప్పిన చిరంజీవి నాగ్ శ్రీకాకుళం అందరిది అని, శ్రీకాకుళంలో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలని, అందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. టెక్కలిలో ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నామని, స్ధలాన్ని పరిశీలించామని ఆయన చెప్పారు. జిల్లాలో మూడు క్రికెట్ స్టేడియంలు ఉన్నప్పుడు మాత్రమే జిల్లాలో రాష్ట్ర స్ధాయి క్రికెట్ పోటీలు నిర్వహించుటకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. స్టేడియంను క్రికెట్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ అధికారి మరియు సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు, క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస్ కుమార్, ఏ.సి.ఏ కార్యనిర్వాహక సభ్యులు బి.వి.రవిశంకర్, నారా ఈశ్వర రావు, కార్యాలయ మేనేజర్ కె.మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.