రెడ్ క్రాస్ రాష్ట్రస్థాయి సైకిల్ యాత్ర..


Ens Balu
0
Srikakulam
2021-03-12 19:50:58

రెడ్ క్రాస్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్రను ప్రారంభిస్తుందని రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు అన్నారు. రాష్ట్ర స్దాయి సైకిల్ యాత్ర ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో ప్రారంభం అవుతుందని వివరించారు. రాష్ట్ర స్ధాయి సైకిల్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్ధ ఛైర్మన్ డా.ఏ.శ్రీధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఏ.కె.ఫరీడా, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి బి.సి.బెహరాతో సహా జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.ఎన్.వెంకట రావు, జాయింట్ కలెక్టర్లు  తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుండి ఒక బృందం, నెల్లూరు నుండి మరో బృందం బయలుదేరుతుందని ఆయన చెప్పారు. ఈ బృందాలు అమరావతి చేరుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ 1920వ సంవత్సరంలో ప్రారంభమైన ఇండియన్ రెడ్ క్రాస్ ఈ ఏడాదికి శత జయంతి పూర్తి చేసుకుందన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్ధ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సంస్ధ చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన చేపట్టుటలో భాగంగా ఈ నెల 16వ తేదీ పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర ప్రారంభం అవుతుందని పేర్కొంటూ యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాలలో యాత్ర సభ్యులు సభలు నిర్వహించి స్వచ్ఛంద రక్తదానం, మొక్కలు నాటడం, పరిశుభ్ర వాతావరణం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ – మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. సైకిల్ యాత్ర శ్రీకాకుళం నుండి బయలు దేరి మధ్యలో మరి కొంత మందిని చేర్చుకుంటూ విజయనగరం చేరుకుంటుందని తెలిపారు. విజయనగరం రెడ్ క్రాస్ కు అందిస్తుందని, అచ్చట నుండి సభ్యులు బయలుదేరి విశాఖపట్నంకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చివరిగా అమరావతి అంచెలంచెలుగా చేరుతుందని వివరించారు. ఈ నెల 25వ తేదీన చివరగా అమరావతి చేరుకుంటుందని తెలిపారు. శ్రీకాకుళం, ఇతర జిల్లాల్లో సైకిల్ యాత్రలో పాల్గొనుటకు ఆసక్తి కలిగి, శారీరక ధారుఢ్యం గల వాలంటీర్లు సైతం చివరి వరకు సైకిల్ యాత్రలో పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్రలో పాల్గొన్నవారికి జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త సైకిల్ యాత్రలో పాల్గొన్న వారికి ఈ నెల 25వ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్ర స్ధాయి ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ పాల్గొంటారని, అచ్చట గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం బహుకరించడం జరుగుతుందని ఆయన వివరించారు.