క్రికెట్ లో ఆక‌ట్టుకున్న క‌లెక్ట‌ర్‌, జెసి..


Ens Balu
2
Vizianagaram
2021-07-24 13:47:14

రెవెన్యూ అధికారుల‌మ‌ధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా జ‌రిగింది. ఉద‌యం, మ‌ధ్యాహ్నం జ‌రిగిన రెండు పోటీల్లో మొత్తం మూడు జ‌ట్లు పాల్గొన‌గా, తుది స‌మ‌రం ఆదివారం జ‌ర‌గ‌నుంది. క‌లెక్ట‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు, ఐటిడిఏ పిఓ, ఆర్‌డిఓ త‌దిత‌ర ఉన్న‌తాధికారులు ప్రొఫెష‌న‌ల్ క్రీడాకారుల మాదిరిగా క్రికెట్ ఆడి ఆక‌ట్టుకున్నారు. తీవ్ర‌మైన ప‌నివ‌త్తిడితో స‌త‌మ‌తం అవుతున్న రెవెన్యూ ఉద్యోగులు, ఆట‌విడుపు కోసం మొత్తం మూడు జ‌ట్లుగా ఏర్ప‌డి,  క్రికెట్‌లో త‌ల‌ప‌డ్డారు. తొలుత ఉద‌యం క‌లెక్ట‌రేట్ జ‌ట్టు, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి.  ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి టాస్ వేయ‌గా, విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీశంక‌ర్ టాస్ గెలుచుకున్నారు. క‌లెక్ట‌రేట్ జ‌ట్టు కెప్టెన్, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ త‌న జ‌ట్టుతో బ్యాటింగ్ ప్రారంభించారు. ఈ జ‌ట్టు త‌ర‌పున బ్యాటింగ్ కు దిగిన క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్లు డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, మ‌యూర్ అశోక్‌, రెవెన్యూ అసోసియేష‌న్ అధ్య‌క్షులు టి.గోవింద‌, శ్రీ‌నివాస్‌, సుభాష్ ధాటిగా బ్యాటింగ్ చేయ‌డంతో, మొత్తం స్కోరు 15 ఓవ‌ర్ల‌లో 74కు చేరుకుంది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్ జ‌ట్టు త‌ర‌పున జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్‌, ఆర్‌డిఓ భ‌వానీశంక‌ర్‌, ఇత‌ర క్రీడాకారులు ధీటుగా బ్యాటింగ్ చేయ‌డంతో, క‌లెక్ట‌రేట్ జ‌ట్టుపై విజ‌యం సాధించింది.  

                 మ‌ధ్యాహ్నం క‌లెక్ట‌రేట్ జ‌ట్టుకు, పార్వ‌తీపురం డివిజ‌న్ జ‌ట్టుకు మ‌ధ్య పోటీ జ‌రిగింది. పార్వ‌తీపురం జ‌ట్టుకు ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్ నాయ‌క‌త్వం వ‌హించారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన క‌లెక్ట‌రేట్ జ‌ట్టు, నిర్ణీత 15 ఓవ‌ర్ల‌లో 117 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన పార్వ‌తీపురం జ‌ట్టు 97 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డంతో, ఓట‌మి చెందింది. తుది స‌మ‌రం ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్రికెట్ పోటీల‌కు హాజ‌రైన జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, జిల్లా క్రీడాధికారి వెంక‌టేశ్వ‌ర్రావు, క్రికెట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి ఎం.ఎల్‌.ఎన్ రాజు, రెవెన్యూ అసోసియేష‌న్ నాయ‌కులు గొట్టాపు శ్రీ‌రామ్మూర్తి, ర‌మ‌ణ‌రాజు త‌దిత‌రులు గ్యాల‌రీనుంచి క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించారు.