పీవీ సింధూ ఎందరికో స్పూర్తి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-01 15:12:02

టోక్యో ఒలింపిక్స్ మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ సింధుకు రాష్ట్ర   పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. "సింధు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఒలింపిక్స్ లో పతకం సాధించడం ప్రతి క్రీడాకారుల కల. ఆ కలను నిజం చేసుకున్న సింధుకు హృదయపూర్వక అభినందనలు. వరుసగా తాను ఆడిన రెండో ఒలింపిక్స్ లో కూడా పతకం సాధించి భారత ఘనకీర్తిని చాటిన సింధు మన తెలుగు బిడ్డ కావడం సంతోషించే విషయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. ఆదివారం కాంస్య పతకం కోసం జరిగిన పోరులో సింధు చైనాకు చెందిన హి బింగ్జియావో పై 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి భారత్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో పతాకం అందించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం సాధించడం ద్వారా సింధు భారతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.