సాహస యువతికి జిల్లా కలెక్టర్ ప్రసంశలు..
Ens Balu
5
Kakinada
2021-08-23 14:55:22
రష్యాలో ఈ నెల 15వ తేదీన మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించిన కాకినాడ యువతి సుతాపల్లి దేవిని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ అభినందించారు. సోమవారం సాహస యువతి దేవి కలెక్టరేట్‌లో కలెక్టర్ హరికిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందడుగు వేసి వివిధ ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తున్న దేవి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పర్వతారోహణలో ప్రతిభ చూపుతున్న దేవి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా దేవి ఒక్కో అడుగు ముందుకేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 15న ఐరోపా ఖండంలోని మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించి, శిఖరాగ్రాన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గతేడాది ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారోను కూడా దేవి అధిరోహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె తనకిష్టమైన పర్వతారోహణ రంగంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో దేవితో పాటు ఆమె తల్లితండ్రులు జ్యోతిర్మయిలక్ష్మి, పద్మరాజు; కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఉన్నారు.