కిక్ బాక్సింగ్ లో సిహెచ్.సతీష్ కి స్వర్ణపతకం..


Ens Balu
1
మచిలీపట్నం
2021-08-30 12:50:24

వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ ఇండియా (డబ్ల్యూ ఏ కె ఓ ఇండియా) జాతీయ స్థాయిలో చలాది సతీష్ గోల్డ్ మెడల్ పొందారు. గోవాలోని పెద్దేమ్, మపూసా లో ఉన్న దయానంద్ బందోకర్ క్రీడా సంకూర్ మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం లో ఈనెల 26 నుండి 29 రాత్రి వరకు నిర్వహించిన కిక్ బాక్సింగ్ పోటీలో మచిలిపట్నంకి చెందిన యువ క్రీడాకారుడు ఈయన 74 కె.జి ల కిక్ లైట్ కేటగిరి లోఉత్తరప్రదేశ్ కి చెందిన ఆలీ అజాజ్ పై విజయం సాధించారు. అలాగే  74కెజి ల లైట్ కాంటాక్ట్  కేటగిరిలో కేరళకు చెందిన అనిల్ కుమార్ పై గెలుపొంది సిల్వర్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో కర్ణాటకను మూడవ స్థానం లో నిలిపిన సతీష్ మచిలిపట్నంలోని ప్రముఖ జర్నలిస్ట్ చలాది పూర్ణచంద్ర రావు కుమారుడు. ఇప్పుడు బెంగళూరులోని "కాప్ జెమిని" లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సతీష్ ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచి ఈ జాతీయ స్థాయికి ఎంపికయ్యేందుకు అర్హత సాధించి స్వర్ణపతకం గెలుపొందారు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలపై వున్న ప్రత్యేక శ్రద్ధతో వ్యక్తిగతంగా ఈ క్రీడపై శిక్షణ పొంది జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాదించటం పట్ల కర్ణాటక క్రీడా మంత్రి,ఆ రాష్ట్ర క్రీడా మండలి,పలువురు ప్రముఖులు సతీష్ ని అభినందించారు. 4 రోజులపాటు జరిగిన ఈనేషనల్స్ లో దేశంలోని 31  రాష్ట్రాలనుండి షుమారు 1500 కి పైగా పురుష,మహిళా క్రీడాకారులు తమపేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో అస్సాం రైఫైల్స్ దళం ,అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ బోర్డ్ కి చెందిన క్రీడా కారులు వున్నారు. ఈ పోటీలలో  వివిధ కెటగిరీలలో స్వర్ణపతకం సాధించిన విజేతలు 2022 మార్చిలో జరుగనున్న ఆసియన్ ఇన్ డోర్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు ఎంపికకు అర్హత సాధించారు.