విలీనం దిశగా సచివాలయ మహిళా పోలీసు పోస్టులు..?!


Ens Balu
10574
Tadepalli
2023-08-01 04:19:38

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయశాఖలో  గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు పోస్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తాజాగా హైకోర్టులో దాఖలైన కేసు తరువాత ఈ పోస్టులను హోంశాఖలో ఉంచాలా..? లేదంటే వేరొక శాఖలో విలీనం చేయాలా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. 2019లో ఈశాఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికగా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశారు. అయితే నాటి నుంచి నేటివరకూ ఈ మహిళా పోస్టుల పోస్టులపై హైకోర్టుల్లో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవలే నమోదైన కేసుకి సంబంధించి మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ విధులకు వినియోగించమని, వారిని పోలీసులుగా పరిగణించడం లేదని హైకోర్టుకి అఫడిట్ దాఖలు చేశారు డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి. ఆ తరువాత నుంచి మహిళా పోలీసులకు లైన్ డిపార్ట్ మెంట్ లేకుండా పోయింది. గతంలో గ్రామ సంరక్షణ, గ్రామాల్లోని విద్యార్ధినిలు, మహిళలకు అండగా ఉంటూ దిశ సేవలను అందించేవారు. ఆ తరువాత వీరిని పోలీసు స్టేషన్లలో విధులకు వినియోగించడంపై కేసు దాఖలు కావడంతో ఆ పనుల వారిని నిలిపివేశారు. అంతేకాకుండా పోలీసుశాఖకు సంబంధించి ఏ ఒక్క పనికూడా వారికి చెప్పడం లేదు. ప్రస్తుతం వారంతా ఓటరు నవీకరణ కోసం బిఎల్వో విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తమకు లైన్ డిపార్ట్ మెంట్ కేటాయించాలని, మళ్లీ పోలీసుశాఖ పనులు, పాత డ్యూటీ చార్టునే అప్పగించాలంటూ అన్నిజిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం కోర్టులో కేసులు నలుగుతున్న సమయంలోనూ.. ఒకే జాబ్ విషయంలో పదే పదే కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో మహిళా పోలీసులను వారి వారి విద్యార్హతను బట్టి ఖాళీగా ఉన్న పోస్టుల్లో విలీనం చేయడం ద్వారా పూర్తిస్థాయిలో సచివాలయ ఉద్యోగాలన్నీ భర్తీచేసినట్టు అవుతుందనే సూచనను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉన్న కోర్టుకేసులతోపాటు, భవిష్యత్తులో కోర్టుకేసులు దాఖలతై ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని చెప్పినట్టుగా కూడా తెలిసింది. ఈ శాఖఏర్పాటైన దగ్గర నుంచి నేటివరకూ దాఖలైన కేసుల్లో పురోగతి ప్రభుత్వం తరపునుంచి సాధించకపోవడాన్ని కూడా ప్రభుత్వంలోని అధికారులు, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నదని తెలిసింది. కాగా మహిళా పోలీసుల సేవలు రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో ని గ్రామ, వార్డు సచివాలయాల్లో పుష్కలంగా అందుతున్నాయి. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా మహిళా పోలీసులు సచివాలయాల్లోని సేవలతోపాటు, ఎన్నికల విధులు, ఐసిడిఎస్ విధులు, పోలీసుశాఖ విధులు, గ్రామ సంరక్షణ విధులు ఇలా అన్నిరకాలుగా పనిచేస్తున్నారు. ఇలా పనిచేసే శాఖను మరొక శాఖలో విలీనం చేస్తే.. ఒక్క శాఖ యొక్క పనులే చేయించగలుగుతామనే వాదన కూడా ఇతర అధికారులు తెరమీదకు తీసుకొచ్చినట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అందునా గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత ఇంకా రానందున వారిని ఇతర శాఖల్లోకి ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి భర్తీచేయడం ద్వారా అన్ని పోస్టులు భర్తీ చేసినట్టుగా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు చెబుతున్నారు.

సచివాలయ మహిళా పోలీసు విభాగం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన తరువాత దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఎంతో చక్కగా ప్రజల్లోకి వెళ్లింది. వీరి ద్వారా గ్రామంలోనే రక్షణ చర్యలు చక్కగా సాగుతున్నాయి. వర్తక వాణిజ్యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు దగ్గర నుంచి గ్రామాల్లో జరిగే ఆందోళనలు నియంత్రించడం, ఉద్యోగులు ఇళ్ల వద్ద ధర్నాలకు వెళ్లకుండా రాత్రంతా కాపలాకాయడం, కోర్టు సమన్ల సమాచారం అందించడం, నాటు సారా నియంత్రణ, స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్ధినిలకు రక్షణ చర్యలు, దిశయాప్ వినియోగంపై అవగాహన ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం వుండేది. ఇపుడు కోర్టుకేసు కారణంగా అవన్నీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా పోలీసుశాఖ విధుల నుంచి వీరిని తప్పించారు. దీనితో మహిళా పోలీసు అనే పేరుకి అర్ధం మారిపోయింది. ఈ తరుణంలో తెరపైకి వచ్చిన అంశాలను కూడా ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నదట. మహిళా పోలీసులు ఉద్యోగులందరూ  నాల్గవ తరగతి కేడర్ కిందకు వస్తున్నందున వీరిని రాష్ట్రవ్యాప్తంగా వున్న జిల్లా ఎస్పీ కార్యాలయాలు, సబ్ డివిజన్లు, దిశ పోలీస్ స్టేషన్లు, పోలీస్ కమిషనరేట్లలో మినిస్టీరియల్ స్టాఫ్ గా నైనా వినియోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. పైగా చాలా మంది ఉద్యోగులు బిటెక్ చేసి ఉన్నందున వారిని సైబర్ విభాగం, కమ్యూనికేషన్ విభాగాల్లోనూ వినియోగిస్తే పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాలు తీసే ఒత్తిడి కూడా ఉండదనే ఆలోచన కూడా పోలీసుశాఖలోని అధికారులు చర్చిస్తున్నారని సమాచారం.

మరోప్రక్క ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సేవలు, వారి ద్వారా ప్రభుత్వానికి కలిసొస్తున్న పనులను ప్రభుత్వం బేరీజు వేస్తున్నది..ఈ నేపథ్యంలో కోర్టుకేసులు కాస్త ఇబ్బంది పెట్టినా..వీరందరినీ డిఎస్సీ ద్వారా ఏపిపిఎస్సీతో నియామకాలు చేపట్టినందున ఒక ప్రత్యేక విధి విధానాలు రూపొందించి వీరి ఉద్యోగాలకు చట్టభద్దత తీసుకువస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. అయితే కోర్టులో దాఖలవుతున్న కేసులన్నీ మహిళా పోలీసు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరగలేదనే విషయాన్ని కేసుల్లో ప్రస్తావిస్తున్నారు ఫిర్యాదు దారులు. వాస్తవానికి మహిళా పోలీసులకు కూడా ప్రభుత్వంపోలీసుశిక్షణను అందించింది. వారికంటే మెరుగ్గా గ్రామాల్లో వీరి సేవలను ఎంతో చక్కగా వినియోగిస్తున్నది. కానీ ప్రభుత్వంలోని కొన్ని సర్వీసు రూల్స్ వీరి నియామకాల విషయంలో మోకాలడ్డుతున్నాయి. వాటిని అదిగమించే విషయంలో కూడా పోలీసుశాఖ గాని, హ్యూమన్ రీసోర్స్ డిపార్ట్ మెంట్ గానీ ప్రత్యేకంగా ద్రుష్టిసారించిన దాఖలాలు లేవు. కోర్టుల్లో కేసులు దాఖలైనపుడు కేసు నుంచి బయటపడేందకు అఫడివిల్లు దాఖలు చేస్తున్నది తప్పితే వాటికి పూర్తిస్థాయిలో పరిష్కారాన్ని మాత్రం చూపించడంలో ప్రభుత్వం విఫలం అవుతున్నదనే విషయం తాజా కోర్టుకేసుల్లో నిరూపితం అయ్యింది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల విషయంలో విలీనాన్ని ఎంచుకుంటుందా..? పోలీసుశాఖలోని మినిస్టీరియల్ సిబ్బందిగా వారిని వినియోగిస్తుందా..? లేదంటే సచివాలయాల్లోనే గ్రామ, సంరక్షణా కార్యదర్శిలుగానే పోలీసు అనుబంధ విభాగంగా వినియోగిస్తుందా..? అనేవిషయం తేలాల్సివుంది..!