గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు పంగనామం..!


Ens Balu
280
visakhapatnam
2024-10-05 13:37:05

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధత లేని గ్రామ, వార్డు సచివాలయశాఖను పూర్తిగా తొలగించి ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయడానికి పూనుకోవడంతోపాటు.. వాలంటీర్లను కూడా తొలగించేసి వారి కోసం ప్రత్యామ్నాయం కోసం ఆలోచనలు చేస్తున్నది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేదుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను పొమ్మనకుండా పొగపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4 లక్షల మంది వాలంటీర్ క్లస్టర్  పరిధిలో ఉన్న 50 కుటంబాలను ఆయా సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేస్తోంది. గత మూడు నెలలుగా పించన్లు పంపిణీ కూడా ఈ విధంగానే చేపట్టిన ప్రభుత్వం అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలన్నీ ఉద్యోగులతోనే చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల ముందే చాలా మంది వాలంటీర్లు రాజీనామాలు సమర్పించడం, గత ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండా వదిలేయడం కూడా కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చింది. 

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వశాఖల్లో కార్యాలయ సహాయకులు కూడా పెద్ద ఎత్తు ఉద్యోగ విరమణలు చేస్తున్నారు. ఇపుడు అక్కడ రెగ్యులర్ ఉద్యోగాలను నియమించాలంటే ప్రభుత్వానికి అతి పెద్ద భారం అవుతుంది. అదే వాలంటీర్లను ప్రభుత్వ కార్యాలయాలయాల్లోకి వినియోగిస్తే ఎలావుంటుందనే కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దానికోసం సాధ్యా సాధ్యానాలను కూడా 19 ప్రభుత్వశాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శిలు, కమిషనర్లు, గ్రామ, వార్డు సచివాలయశాఖ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నది. అదే సమయంలో ప్రస్తుతం ఇదే శాఖలో చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇక భర్తీచేయకుండా  ఉన్న పోస్టులను కుదించేస్తే ప్రభుత్వానికి ఆర్ధిక భారం కూడా తగ్గుతుందనే ప్రతిపాదన ప్రభుత్వశాఖల అధికారులు క్యాబినెట్ ముందుకి తీసుకెళ్లనున్నట్టు తెలస్తోంది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే గ్రామ, వార్డు సచివాలయశాఖకు కావాలనే చట్టబద్ధత చేయకుండా వదిలేయడంతో ఈ శాఖను అదే కారణంతో ఏమైనా చేయడానికి, ఉన్న ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీలు చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం అపుడే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఖాళీగా ఉన్న పంచాయతీల్లో నియామకాలు చేపట్టింది. ఇప్పటి వరకూ మేజర్ పంచాయతీల్లో ముగ్గురుచొప్పున ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఇటీవల జరిగిన బదిలీల్లో ఖాళీగా ఉన్న పంచాయతీలకు బదిలీలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఒక్కో పంచాయతీ కార్యదర్శి నాలుగైదు పంచాయతీలకి ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం కూడా మేజర్ పంచాయతీల్లో అదనంగా ఉన్న పంచాయతీ కార్యదర్శిలకు బదిలీల పేరుతో పంచాయతీలను అప్పగించింది. తద్వారా ప్రస్తుతం అదనపు విధులు చేస్తున్న వారికి భారాన్ని తగ్గించి.. మాతృశాఖల్లోకి ఉద్యోగుల విలీనం కూడా మొదలు పెట్టింది.

 అంటే ఇక్కడ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను  వారి మాతృశాఖలకు పంపించే కార్యక్రమం పంచాయతీరాజ్ నుంచే ప్రారంభం అయ్యిందన్నమాట. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 పెంచడంతో ఆ రెండేళ్ల సమయం ఉద్యోగులకు 90శాతం పూర్తయిపోయింది. దీనితో ప్రతీ నెలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లో ఉద్యోగులు వందలాదిగా రిటైర్ అవుతున్నారు. అక్కడ ఉద్యోగాలు కూడా భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. ముందుగానే మేలుకున్న ప్రభుత్వం అత్యధిక ఉద్యోగులున్న ప్రభుత్వశాఖగా గుర్తింపు పొందిన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను మాతృశాఖలకు పంపేయడం ద్వారా ఖాళీ అయిపోయిన ఉద్యోగాల భర్తీ, పరిపాలనా సౌలభ్యం రెండూ కలిసి వస్తాయని భావించి వాటికి పచ్చజెండా ఊపేసింది.

గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు నియమాకాలు చేపట్టినపుడే ఐదేళ్లు దాటిన తరువాత సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ చార్ట్ ప్రకారం పదోన్నతులు కల్పిస్తామని వారికి ఏర్పాటు చేసిన సర్వీసు రూల్స్ లో పేర్కొంది. అయితే చాలా ప్రభుత్వశాఖల్లో చాలా ఉద్యోగాలు ఖాళీ అయిపోతుండటంతో ముందు ఆ ఖాళీలు భర్తీచేసి, ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీచేసేస్తే తరువాత.. పదోన్నతులన్నీ ఒకేసారి ఏకీకృత విధానాలు అమలు చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారితోపాటు 4 లక్షల మంది వాలంటీర్లు కూడా పనిచేస్తున్నారు. వీరందరినీ ఆయా ప్రభుత్వశాఖల్లోకి బదిలీచేసేస్తే.. వాలంటీర్లు తీసేయడం ద్వారా వీరు చేసే అన్నిపనులనూ ఉద్యోగులతో చేయించాలనే ప్రభుత్వ ఆలోచన. 

దానికి అనుగుణంగా ఇప్పటికే వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లను, వారికి కేటాయించిన కుటుంబాల వివరాలను సేకరించింది. వాటన్నింటినీ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సచివాలయ ఉద్యోగులతోనే ప్రస్తుతానికి పెన్షన్లను పంపిణీ చేయిస్తుంది. ఇకపైనా ఉద్యోగులతోనే పనిచేయిస్తే.. సరిపోతుందని దానికోసం ప్రత్యేకంగా వాలంటీర్లును తీసుకోవడం వలన కలిగే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదనేది ప్రభుత్వం ఆలోచన. దానికి అగుగుణంగానే ముందు ఉద్యోగుల కేటాయింపులు, మాతృశాఖల్లో విలీనాలు జరిగిపోతే ప్రక్రియ ఒక కొలిక్కి తీసుకురావొచ్చుననేది అధికారులు సాధ్యాసాధ్యాలను అత్యంత వేగంగా పరిశీలిస్తున్నారు. ఇది పూర్తయిపోతే దాదాపు గ్రామ, వార్డు సచివాలయశాఖ బోర్డు తీసేయడం ఒక్కటే మిగిలివుంటుంది.

 ప్రస్తుతానికి సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల విధులు, ఆధార్ నమోదులు, ఇతర సమాచార సేకరనణ తప్పితే మరేమీ లేవు. దానిని గుర్తించిన ప్రభుత్వం సిబ్బంది అందరినీ అవకాశం ఉన్నంత మేర గ్రామాల్లో  గ్రామ పంచాయతీలకు, పట్టణాలు, నగరాల్లో పురపాలకశాఖలోనూ విలీనం చేసేయడం ద్వారా  గ్రామ, వార్డు సచివాలయశాఖకు మంగళం పాడేయవచ్చుననేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తున్నది. ఇప్పటికే సచివాలయాల్లోని ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసు స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి పదోన్నతులు కల్పించి వారిని ఆరోగ్యశాఖలో విలీనం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల్లో వారిని నియమించేందుకు జీఓనెంబరు 115ని తీసుకొచ్చింది. అయితే అనూహ్యంగా ఈ జీఓపై కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కోర్టుకి వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తరువాతనైనా వీరిని ఆరోగ్యశాఖలోకి విలీనం చేసేయడానికే కార్యాచరణ వేగంగా సాగుతోంది. ఇక గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పంచాయతీరాజ్ లో విలీనం చేస్తారు. వీఆర్వోలు, సర్వేయర్లు రెవిన్యూశాఖలోనికే వెళ్లిపోతారు.

 గ్రామీణ వ్యవసాయ సహాయకులు వ్యవసాయశాఖలోకి, హార్టికల్చర్ సహాయకులు హార్టికల్చర్ లోకి, యానిమల్ హజ్బెండరీ సహాయకులు పశు సంవర్ధక శాఖలోనికి, మత్స్య సహాయకులు మత్స్యశాఖలోకి, సెరీకల్చర్ సహాయకులు సెరీ కల్చర్ లోనికి పంపేస్తారు. ఇక మిగిలి ఉన్నది ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు. ఇందులో మహిళా పోలీసులపై కోర్టు కేసులు ఉన్నాయి. వెల్పేర్ అసిస్టెంట్లను సోషల్ వెల్పేర్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ల కి గానీ, లేదా పాఠశాల విద్యాశాఖలోకి గానీ విలీనం చేసి పాఠశాలల్లో మినిస్టీరియల్ స్గాఫ్ గా నియమించే ఆలోచనలు జరుగుతున్నాయని వినికిడి.  ఎటొచ్చీ  ఏ ప్రభుత్వశాఖ లేకుండా ఉండిపోయిన మహిళా పోలీసులను పోలీసు స్టేషన్లలో మినిస్టీరియల్ స్టాఫ్ గా వినియోగించాలా..?

 లేదంటే వారి విద్యార్హతలు పెరిగిన పేస్కేలును అనుసరించి వార్డు సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శిల ఖాళీల్లోకి పంపాలా..? అదీ కుదరదంటే జిల్లా పోలీసు శాఖలోని ఉద్యోగుల విద్యార్హతలను బట్టి సైబర్ విభాగం, స్పెషల్ టీం,  కార్యాలయ సహాయకులుగా పంపాలనే దానిపై సమాలోచనలు జరగుుతున్నాయి. అందరిని అన్నిశాఖలకు పంపేస్తే.. ఇక వాలంటీర్లతో పని ఉండదు కనుక. వారికోసమే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందనేది ప్రభుత్వం ముమ్మరంగా చర్చలు జరుపుతున్నది. త్వరలో జరగబోయే క్యాబినెట్ బేటీలో విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి..ప్రభుత్వం ప్రకటించినట్టుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లను ప్రభుత్వశాఖల్లో సహాయకులుగా నియమిస్తుందా.. ఆ ప్రకనటతో వారిని ఏమీ చేయకుండా అలానే ఉంచి.. సచివాలయ ఉద్యోగులను ముందు విభజన చేసి వారి మాతృశాఖలకు పంపించి.. చట్టబద్దత లేని శాఖను పూర్తిగా రద్దు చేస్తుందా అనేది..!