దసరా పండుగకి దెబ్బేసేసిన కూటమి సర్కారు..?!


Ens Balu
146
visakhapatnam
2024-10-09 14:03:53

మందేస్తూ చిందెయ్ రా.. చిందేస్తూ మందెయర్.. జల్సా చెయ్యి జల్సా చెయ్యి.. బారులన్నీ ఇరగదియ్యి..తగ్గిన రేట్లతో బాటిలంతా కుషీ చెయ్.. ఈ రేంజ్ లో ఊహించుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోని మందులు బాబులు.. దసరాకి కూటమి ప్రభుత్వం తగ్గించిన మద్యం ధరలతో ఎంచెక్కా ఎంజాయ్ చేయాలనుకుంటే.. ఖాళీ అయిన ఖజానాని మద్యం టెండర్లు ద్వారా నింపుకోవాలనుకున్న ఏపీ సర్కారు.. మందుబాబుల కిక్కుపై దారుణంగా దెబ్బేసేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం నేరుగా మద్యం ద్వారా ప్రధాన ఆదాయాన్ని సమకూర్చు కోవాలనే లక్ష్యంతో టెండర్ల ప్రక్రియకు తెరతీసింది. అనుకున్నట్టుగానే ఖజానికి నాన్ రిఫండబుట్ ఆదాయం క్రింద సుమారు రూ.1000 కోట్ల పైనే ఆదాయం వచ్చింది. కాసుల కిక్కుతో జోష్ పెంచుకొని మరీ టెండర్ల ప్రక్రియను గడువు పెంచేసిన సర్కారు మందుబాబుల ఆశల నిషాని ఒక్కసారిగా దించేసింది. దీనితో ఓటుతో కూటమిని గద్దెనెక్కించినా.. పండుగ రోజు కూడా పెంచేసిన మద్యం రేట్లతోనే మందు కొనుక్కోవాల్సి వస్తుందని బరువెక్కిన హృదయాలతో మందుబాబులు తెగ బాధపడిపోతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా మద్యమే ప్రభుత్వాలకి ప్రధాన, నిత్య ఆదాయ వనరు. బార్లు బార్లా తెరిచి.. మద్యం షాపులు ఎక్కువ సమయం ఉంచితేనే సర్కారుకి కాసులు గళ గళ లాడతాయి. మందుబాబులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వ ఖజానా పూర్తిగా డీలా పడిపోతుంది. ఒక్కసారిగా ఆదాయం పడిపోతుంది. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు ఆదాయాన్ని తెచ్చి పెట్టే మందు బాబుల కోసం కూటమి సర్కారు కనీసం ఆలోచించకపోవడపై మందుబాబుల మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మందు రేట్లను అమాంతంగా పెంచేస్తే.. ఆ ప్రభుత్వంపై కిక్కుతో కసితీర్చుకున్న మందుబాబుల ఆనందం కనీసం మూడు నెలలు తిరగకముందే కూటమి ప్రభుత్వం కూడా మీ కిక్కు కంటే కాసుల కిక్కే మాకు ముఖ్యమంటూ మద్యం టెండర్ల ప్రక్రియను మరో రెండు రోజులు పెంచేసింది. దీనితో దసరా పండుగ రోజు తగ్గిన మద్యం ధరలతో మందు తాగుదామనుకున్న మందుబాబుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. 

ప్రభుత్వం మందుబాబుల మనోగతాన్ని దృష్టి పెట్టుకుంటే ఈ విధంగా వ్యవహరించేదా..? కష్టపడి పనిచేసుకొని వచ్చి కూలీ ఇంటికి కూడా ఇవ్వకుండా ముందుగా ఆనందంతోనే వైన్ షాపులో చుక్క సీసా కోసం ఇచ్చేస్తున్నామే.. అయినా కూటమి సర్కారుకి కరుణలేదు.. కనికరం లేదు.. కనీసం పండుగకైనా తగ్గించిన మద్యాన్ని ఇద్దామనే ఆలోచన లేదు.. ఇదేనా మందుబాబులకి కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం.. ఇదేనా కూటమి సర్కారు పెద్దరికం.. మంచి మనసుతో మద్యం రేట్లు తగ్గించి దసరా పండుగకు మన ముందుకి ఠీవిగా మందుసీసా వస్తుందనుకుంటే ఇదా కూటమి సర్కారు చేసిన కుట్ర.. ఏం రెండు రోజుల టెండరు ప్రక్రియ ముందుగానే చేసుకుంటే.. మందు రేటు తగ్గించారనే ఆనందంతో మరో రెండు సీసాలు కొనుక్కోమా.. అపుడైనా ప్రభుత్వానికి ఆదాయం రాదా..? చఛా చాలా తప్పుచేశాం. కూటమిని నమ్ముకున్నందుకు దసరా పండుగరోజే దెబ్బేసేస్తుందా..? అంటూ బాధాతత్ప హృదయాలతో మందుబాబులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 3,396 మద్యం దుఖాణాల పరిధిలోని మందు బాబులు అత్యవసర సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేస్తున్నారట. ప్రస్తుతం ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది.  

కొత్త మద్యం షాపులు వస్తున్నాయని సంబర పడిన మందుబాబుల ఆనందం దసరా పండుగ రోజుతో మొదలవుతుందనుకుంటే.. ఆరోజే వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటు చేసిన రేట్లు పెంచిన మందునే కొనుక్కుని తాగేలా చేయడానికి మనుసు ఎలా వచ్చిందంటూ మందు బాబు ప్రెస్టేషన్ లో చాలా ఎక్కువ మందు తాగేస్తున్నారు. మద్యం షాపుల దగ్గరే కూటమి ప్రభుత్వ తీరుపై తన నిరసనను తెలియజేస్తున్నారు. మందుకొట్టిన బాధలతో కాస్త గట్టిగానే కూటమి సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు. కాస్త రేటు తక్కువగా ఉన్న మందుతాగే వారు మద్యం షాపుల ద్గగర చర్చలు పెడుతుంటే..  రేటు ఎక్కువ మద్యం తాగేవారు మాత్రం ప్రతీరోజూ వేసే సిటింగ్ లో ఈ విషయాన్నే అధికంగా చర్చిస్తున్నారట. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మందు బాబుల ఓట్లు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఎంతో కీలకం అయ్యాయి. ప్రభుత్వం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం రేట్లు తగ్గించాలని చూసిన ప్రకటన కూడా మందుబాబుల గొంతులో రేట్లు తగ్గించిన మందుపోసినంత పనిచేశా యి. కానీ ఆ ప్రకటన అంతలోనే తీరని బాధ మిగిల్చిందని తెగ బాధపడుతున్నారు. వీరి బాధలు విన్న చూపరులు కూడా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఈ ప్రభావం ఏపీ సర్కారుపై ఏ విధంగా చూపిస్తుందో మరి..?!