గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాతృశాఖలకే..!


Ens Balu
9380
visakhapatnam
2024-09-26 06:18:51

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో  గ్రామ, వార్డు సచివాలయ శాఖ రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. గత ప్రభుత్వం చేసిన తప్పులే ప్రస్తుతం ఈ ప్రభుత్వశాఖ రద్దు అవడానికి కారణమవుతున్నాయి.. దానికితోడు రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు వారి విధులు వారు నిర్వర్తించుకుంటే.. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖల విధులు చేపడుతున్నా..వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ప్రయోజనాలు మాత్రం రావడం లేదు. ఐదేళ్లు దాటిపోయినా వీరికి పదోన్నతులు దక్కలేదు. కొన్నిశాఖలకు సర్వీసు నిబంధనలే ఏర్పాటుచేయలేదు. మరి కొన్నిశాఖల సిబ్బంది ఉద్యోగాలపై కోర్టు కేసులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అన్నింటికీ మించి ఈ సచివాలయశాఖకు చట్టబద్ధత లేనేలేదు. ఈ తరుణంలో ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర అధికారులు గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులను వారి మాతృశాఖల్లో విలీనం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారట రాష్ట్ర అధికారులు. అంతేకాదు.. గత ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్ మెంట్ వయస్సు 62ఏళ్లకు పెంచేయడంతో ఇపుడు ఆ సమయం కూడా పూర్తయిపోతున్నది. ఈ తరుణంలో 74 ప్రభుత్వశాఖల్లో భారీగా ఉద్యోగుల కొరత ఏర్పడనున్నది. 

ప్రస్తుతం ఖజానాలో కాసులు నిండుకుండటంతో.. కొత్త ఉద్యోగాలకి నోటిఫికేషన్లు తీసే పరిస్థితి లేదు. పరిపాలనా సౌలభ్యం కారణం చూపి ఉన్న ఉద్యోగులనే ప్రభుత్వశాఖలకు సర్ధుబాటు చేస్తే తప్పా..మరే ఇతర పనులూ పూర్తయ్యేటట్టు కనిపించడంలేదు. దీనితో గ్రామ, వార్డు సచివాలయశాఖను రద్దు చేసి ఇందులోని 19 ప్రభుత్వశాఖల ఉద్యోగులను వారికి నియామాకాలు చేపట్టిన మాతృశాఖల్లో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి వీలుపడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నది. అలాగని ఈ ప్రభుత్వశాఖను అలాగే ఉంచేయాలన్నా వీలుకాని పరిస్థితి నెలకొంది. నేటికీ ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత లేకపోవడంతో ఈ ప్రభుత్వశాఖను రద్దు చేయడానికి గల సాధ్యాసాధ్యాలను కూడా అధికారులు వెతుకుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వశాఖల్లోనూ ఉద్యోగులు రిటైర్ కావడంతో వారి స్థానాల్లో సచివాలయ ఉద్యోగులను నియమించడం ద్వారా పరిపాలన విధులకు భంగం వాటిల్ల కుండా వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన. పైగా ఇపుడు ఉద్యోగులకు పదోన్నతులు కూడా ఇచ్చే అంశాలని కూడా పరిశీలన చేస్తుందట. అలా చేయడం ద్వారా సచివాలయ ఉద్యోగులకంటూ ఒక ప్రభుత్వ శాఖ ఉంటుంది. అదే సమయంలో సదరు శాఖలోని ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వీరికి కూడా అందే అవకాశం ఏర్పడుతుంది. 

లేదంటే చట్టబద్ధత లేని ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు గత ప్రభుత్వం కుదించేసినట్టుగానే అన్ని ప్రయోజనాలు కూటమి ప్రభుత్వం కూడా కుదించేయక తప్పదు. అలా చేయకపోతే ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా పడుతుంది. పైగా ఈసచివాలయశాఖలోని కొన్ని శాఖల సిబ్బందికి పూర్తిస్థాయిలో పనులు కూడా ఉండటం లేదని రాష్ట్ర అధికారులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్టు గా తెలిసింది. ఇలాంటి సమయంలో ఈ శాఖను రద్దు చేసి.. ఉద్యోగులను వారి విద్యార్హతలను బట్టి.. వారిపోస్టులను బట్టి ఇతర ప్రభుత్వశాఖలకు అప్పగించేయడం ద్వారా రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలు భర్తీచేసినట్టు అవుతుంది. ఇప్పటికే సచివాలయాల్లోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లను పంచాయతీరాజ్ లోని భారీగా ఖాళీలు ఏర్పడే పంచాయతీ కార్యదర్శిల పోస్టుల్లో భర్తీచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు పంచాయతీలను అప్పగించి.. అక్కడ ఇన్చార్జి వ్యవస్థను తొలగించాలని.. ఇంకా ఖాళీలు ఉంటే డిజిటల్ అసిస్టెంట్లను కూడా చిన్న పంచాయతీల్లో సర్దు బాటు చేయాలనే యోచనకువచ్చారట అధికారులు. 

 అందులోనూ ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ప్రస్తుతం ఏ ప్రభుత్వశాఖనూ కేటాయించకుండా కోర్టు కేసుల నెపంతో గాల్లో ఉంచారు. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లకు నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖ ను రద్దు చేసి.. గ్రామ పంచాయతీల్లో గతంలో మాదిరిగానే కనీసం ఐదుగురు సిబ్బంది ఉండేలా ప్రణాళికలు చేయడానికి.. వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని పట్టణ పురపాలక సంస్థలో విలీనం చేసి కార్పోరేషన్లు, మున్సిపాలిటీ సిబ్బందిగా మార్చడానికి సమాచాలోచనలు చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

వాలంటీర్లను తొలగించి.. ప్రభుత్వశాఖల్లో నియమించి..?
గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న వాలంటీర్లను గత ప్రభుత్వమే వారి కాంట్రాక్టును రెవిన్యువల్ చేయలేదు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గత మూడు నెలలుగా జీతాలు చెల్లిస్తూ వస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయశాఖను రద్దు చేస్తే అత్యవసరంగా వాలంటరీ వ్యవస్థను కూడా రద్దు చేసేయవచ్చు. తద్వారా అక్కడి సిబ్బందిని ప్రభుత్వశాఖల్లో సహాయకులగా నియమించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. అందులోనూ ఎలాగూ వీరి జీతం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచే సమయంలో వారిని ఇళ్ల దగ్గర కాకుండా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవకాశం ఉంటే మరో రూ.5 వేలు పెంచి వారికి కార్యాలయాల్లో సహాయకులుగా నియమించాలని ప్రభుత్వంలోని అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. అలా ఎవరైతే ఇష్టంగా పనిచేయడానికి ముందుకి వస్తారో అలాంటి వారందని ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వశాఖల్లో నియమించి వారి సేవలను వినియోగించుకోనున్నారట. అయితే ఇవన్నీ ప్రాధమికంగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు ఆలోచిస్తున్న తీరు మాత్రమే. 

ఇది పూర్తిగా అమలు అయినా.. అమలు కాకపోయినా ఆశ్చర్యపోనవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకే బాగా చేరువ అయిపోయాయి. ఒక్కసారిగా వీటిని రద్దు చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరే భావం ఏర్పడుతుందని.. నిరుద్యోగులకు తెలిస్తే.. తమకు వచ్చే ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగులతో సర్ధుబాటు చేసేసుకుంటున్నారనే ఆందోళనలు కూడా అధికమవుతాయనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారట. ఈ పనులన్నీ జరిగి కార్యరూపంలోకి రావాలంటే సుమారు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టినా పట్టొచ్చునన చెబుతున్నారు. చూడాలి గ్రామ, వార్డుసచివాలయశాఖను పూర్తిగా రద్దుచేస్తారా..? ఇందులోని ఉద్యోగులను మాతృశాఖల్లోకి విలీనం చేస్తారా..వాలంటీరల్లను తొలగించి ప్రభుత్వశాఖల్లోని సహాయకులుగా నియమిస్తారా..? కాదూ కూడదు.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను అలాగే ఉంచి ఉద్యోగుల ప్రయోజనాలను పెంచి.. ప్రభుత్వానికి అనుకూలంగా వారి సేవలను వినియోగించుకుంటుందా.. అనేది. ..!