13.. 26.. 30.. తెరపైకి కొత్త జిల్లాలు..?!


Ens Balu
1667
visakhapatnam
2024-10-06 18:20:21

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014)  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి.. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 26 జిల్లాలు కాస్తా 30 జిల్లాలు కాబోతు న్నాయి.. అదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజమే.. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్ర దేశ్ లో కూడా 26 జిల్లాలను 30 జిల్లాలుగా మార్చే ప్రతిపాదనలు తెరపైకి తీసుకువచ్చిందట. ఇదే విషయం ఒక పోస్టు విషయంలో తెగ వైరల్ అవుతోంది. అందులో గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు ఒకటి రెండు కనుమరుగై.. వాటి జిల్లా కేంద్రాలు మరో ప్రదేశానికి మారనున్నాయని.. కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటు కానున్నాయనేది ప్రతిపాదిత జిల్లాల సారాంశం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసి అరకొరగా జిల్లాల విభజన చేపట్టింది.  ఆతరువాత ప్రభుత్వశాఖల విభజన, కార్యాలయాల విభజన కూడా పూర్తిగా జరగలేదు. అంతెందుకు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తప్పితే.. కేంద్రం నుంచి మాత్రం అనుమతి పొందలేకపోయింది.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి విభజనలు చేపట్టినా దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర, పార్లమెంటు ఆమోదంతో చట్టబద్దత అవసరం. కానీ అధికారంలో ఉండగా అంతమంది ఎంపీలు గెలిచినా కూడా కేంద్రంలో కొత్తజిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి ఆమోద ముద్ర మాత్రం తెచ్చే ఏర్పాటు చేయలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇపుడు కూటమి ప్రభుత్వం తాజా గా పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలను 30 జిల్లాలుగా ప్రతిపాదిస్తూ చేస్తున్న సవరణ ఏర్పాట్లు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు ఇంకా చాలా వరకూ కేంద్రం అమలు చేయాల్సి వున్నది. దానిపై అటు తెలంగాణ కానీ.. ఇటు ఆంధ్రప్రదేశ్ గానీ కేంద్ర ప్రభుత్వంపై ఈ విషయంపై ఒత్తిడి తీసుకురాలేదు. 

- రాష్ట్రంలో కొత్తజిల్లాలకు చట్టబద్ధత రావాలంటే ఏం చేయాలి..?
భారదేశంలోని 29 రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 52  ప్రకారం ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ముందుగా దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి. రాష్ట్రపతి ఆమోదం కావాలంటే రాష్ట్రంలో చేసిన మార్పులపై రాష్ట్రప్రభుత్వం రాజపత్రం విడుదల చేయాల్సి వుంటుంది. దానిని రాష్ట్రపతి ఆమోదించిన తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదించి దానిని బిల్లుగా పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. అక్కడ బిల్లు పాసైన తరు వాత మాత్రమే దానికి కేంద్రం విడుదల చేసి రాజపత్రం ద్వారా చట్టబద్దత వస్తుంది. ఇవన్నీ జరగాలంటే కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్ర భుత్వా నికి పూర్తిస్థాయిలో సత్సంబంధాలు కలిగిఉండాలి. ప్రాధాన్యతా పరమైన అంశానికి సంబంధించి త్వరగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరగాలి. 

కానీ ఈ విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సైతం  ఆ చట్టబద్ధత తేలేకపోయింది. గత ప్రభుత్వ విధానాలే ఇపుడు మళ్లీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకి మార్గం సుగంచేశాయి. అంటే 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చినా కూడా కేంద్రం అనుమతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర లేదు. కేవలం రాష్ట్రంలోని పరిపాలన, రికార్డుల్లో మాత్రమే రాష్ట్రంలో ఇప్పటి వరకూ 26 జిల్లాలు కానీ.. కేంద్రప్రభుత్వం దృష్టిలో కూడా విభజన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 13 జిల్లాలే. ఆ జిల్లాల గణాంకాల ఆధారంగానే అధికారుల(ఐఏఎస్, ఐపీఎస్) పంపిణీ జరుగుతున్నది. అదనంగా కొన్ని సివిల్ సర్వీసు పోస్టులు మంజూరు చేసినా రాష్ట్రంలోని ప్రభుత్వశాఖల్లో అవసరాన్ని బట్టి వాటిని రాష్ట్రప్ర భుత్వం వినియోగించుకుంటోంది.

-కొత్తజిల్లాల్లో రాష్ట్రపతి ఆమోద ముద్రతో లాభమేంటి..?
దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే..వెంటనే పార్లమెంటులో బిల్లుగా పాసై చట్టం అవుతుంది. అలా చట్టం చేస్తే కొత్త జిల్లాలకు కేంద్రప్రభుత్వంలో గుర్తింపు వస్తుంది. అపుడు పాత 13 జిల్లాల స్థానంలో కొత్తగా గుర్తింపు వచ్చిన జిల్లాలు నమోదు అవుతాయి. ఆ తరువాత జనాభా గణన, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పెంపు కూడా జరుగుతుంది. అంతేకాదండీ.. ఇప్పటి వరకూ ఉన్న జిల్లా పరిషత్ లు కలెక్టరేట్లకు నిర్మాణాలు, అధికారుల కేటాయింపులు కూడా అదనంగా జరుగుతాయి. అవసరాన్ని బట్టి కొత్తగా పంచాయతీలు, మండలాల ఏర్పాటు కూడా జరుగుతుంది. 

తద్వారా విభజన జరిగిన స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధుల మొత్తం పెరుగుతుంది. కేంద్రం నియమించే అఖిలభారత సర్వీసుల అధికారుల కేటాయింపులు కూడా అధికంగా జరుగుతాయి. తద్వారా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కమిషనర్ పోస్టులు కూడా పెరిగే అవకాశం వుంటుంది. జిల్లాల అభివృద్ధికి నిధులు కూడా మంజూరువు  అవుతాయి. సర్వసాధారంగా జిల్లాలకు ఉన్న నిధుల కంటే అధనంగా పెంచి ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కేంద్రంలో విభజన అంశాలకు చట్టబద్దత లేకుండా అలానే ఉంచేస్తుంటాయి. దానికి కారణం రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోవడమే. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులకు రాష్ట్రాలు కేంద్రం ద్వారా వచ్చే నిధులు కోల్పోవాల్సి వస్తుంది.

-చిన్న జిల్లాల వలన ఉపయోగమేంటి..?
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాది అవకాశాలు పెరుగుతాయి. ప్రభుత్వశాఖల్లో నియమకాలు చేపడతారు ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగాలు ఏర్పాటు కావడంతో ప్రభుత్వంపై సమస్యల పరిష్కార భారం తగ్గుతుంది. ఏ జిల్లా పరిధిలోని సమస్యలను ఆ జిల్లాయంత్రాంగం పరిష్కరించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రైవేటు కంపెనీలు రావడానికి, రవాణా మార్గాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. విభజన ఆంధ్రప్రదేశ్ లో ఇపుడు కొత్త జిల్లాల ప్రతిపాదనతో చాలా కాలం క్రితం జరగాల్సిన జనాభా గనణ, అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పెంపు అన్నీ ఒకేసారి జరగడానికి వీలుపడుతుంది. ఒక రకంగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రకాలుగా కూడా ఈ విభజన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది.

 అయితే ఇక్కడ రాష్ట్రప్రభుత్వంలో అధికారంలో ఉన్నపార్టీలు కేంద్రాన్ని ప్రశన్నం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ తరహా పనులు వేగవంతం అవుతాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా..అది కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందులోనూ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి జోనల్ విధానం, ఉమ్మడి జిల్లాల ప్రాతిపధిక అంశం మార్పు కాకపోతే ప్రభుత్వశాఖల్లో బదిలీలు, నియమాకాలన్నీ కూడా ఉమ్మడి జిల్లాల్లో నే చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు అయినా.. ఇంకా ప్రభుత్వ పరిపాలన అంశాలన్నీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. అంతేకాదు కేంద్రప్రభుత్వం దృష్టిలో ఏపీలో ఉన్న జిల్లాలు కేవలం 13 మాత్రమే. పెంచిన జిల్లాల అంశం కేవలం రాష్ట్రానికే పరిమితం అయిపోయింది.

-వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంతా అరకొరగానే..
2019-2024 వరకూ అధికారంలో వున్న వైఎస్సార్సీపీ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా గెజిట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నది. కొత్త జిల్లాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఐ అధికారులను మాత్రం నియమించింది తప్పితే 75 ప్రభుత్వశాఖలను మాత్రం పూర్తిస్థాయిలో విభజన చేయలేదు. కేవలం కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే విభజన జిల్లాల్లో ఏర్పాటు చేసి.. చాలా కార్యాలయాలు ఇంకా ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఉంచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్లు, 12 భాగాలు ఉన్నాయి.  దానిప్ర కారం కేంద్ర ప్రభుత్వం విభజన అంశాలన్నీ అమలు చేయాల్సి వుంది. అటు కేంద్రం రాష్ట్రానికి అమలు చేయడం మానేస్తే.. ఇటు రాష్ట్రం కూడా జిల్లాల్లో చేపట్టిన విభజన కూడా తూ తూ మంత్రంగానే చేపట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ఐటిడిఏలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన కూడా పరిపాలనకు కాస్త విఘాతం ఏర్పడింది.

 దానికి ఉదాహరణ.. ఉమ్మడి విశాఖజిల్లాలోని పాడేరులో ఐటిడిఏ ఉండగా అక్కడే అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది. ఇపుడు తాజాగా మళ్లీ కొత్త జిల్లా ప్రతిపాదనలో ఆ జిల్లా అలాగే ఉంచి జిల్లా కేంద్రాన్ని నర్సీపట్నంలో పెట్టాలన్నది ప్రతిపాదన. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జిల్లా మొదట నర్సీపట్నంలోనే ప్రారంభం కావాల్సి వుంది. అనివార్య కరాణాల వలన అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రదేశాలు ఏజెన్సీలో ప్రాంతంలో అధికంగా ఉండటం.. అవన్నీ పాడేరు, రంపచోడవరం డివిజన్లలో అధికంగా ఉండటంతో అన్నింటిని అల్లూరి సీతారామరాజు జిల్లా(పాడేరు) జిల్లా మార్పు చేశారు. ఇలా చాలా అంశాలన్నీ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ప్రతిపాధించిన కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేస్తే తప్పా.. అభివృద్ధి కానరాదు.. పెరుగుతా యనుకు న్న నిధులు కూడా పెరిగే అవకాశం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో విభజన ఆంధ్రప్రశ్ అంశం, నియోజ కవర్గాల పునర్విభజన అంశాలు పార్లమెంటులో బిల్లు అయ్యే అవకాశం వుంటుంది. అదీ ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త జిల్లాల ప్రతిపాదన అంశం నిజమైతే.. లేదంటే గత ప్రభుత్వం మాదిరిగానే.. చేసిన మార్పులన్నీ రాష్ట్రానికి సరిపెట్టుకోక తప్పదు. చూడాలి ఏం జరుగుతుందనే ది..!