కశ్మీర్ ను తలదన్నే లంబసింగి అందాలు..
Ens Balu
27
Lambasingi
2021-01-03 12:08:26
ఆ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంది.. అక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో 1-3కి పడిపోతాయ్ ..మంచు అయితే వర్షంలా కురుస్తుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నామా..కాశ్మీర్ లో ఉన్నామా అనే భావన కలుగుతుంది..అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించింది ఆ గ్రామం.. అదే ఆంధ్రా ఊటీ లంబసింది..అదేంటి ఆంధ్రా ఊటి అరకు కదా అనుకుంటున్నారు కదా.. ఆ పేటెంట్ నేమ్ ఇపుడు లంబసింగి సొంతమైంది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే..లంబసింగి టూరిజం స్పాట్ గా తయారైన తరువాత 70శాతం పర్యాటకులు కేవలం లంబసింగిలోని అత్యల్పంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఆ మంచులో లేలేత భానుడి అందాలు...అకాశంలో తేలియాడేటట్టు కనిపించే మబ్బు తెరలను చూడటానికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖ మన్యంలోని ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది ఈ లంబసింగి ప్రాంతం..
ఇక్కడ విశేషం ఏంటంటే ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగానే ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూనే వుంటుంది. ఉదయం 10 గంటలకైనా మంచు నీడ వీడ కుండా ఎదుటి వ్యక్తి కూడా కనబడనంగా వాతావరణం మారిపోతుంది. శీతల గాలులు వీస్తూ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతూ రారమ్మని ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే 250మంది ఇపుడు 2500గా మారారంటే దానికి కారణం ఈ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారడమే. అయితే ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటే మాత్రం మరింత మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి వుండేది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1-5 నుంచి 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు అధికంగా వుంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలు అతిశీతల వాతావరణం కాశ్మీర్ లోనూ, కొడైకెనాల్ లోనూ, ఊటీలో మాత్రమే కనిపిస్తాయి.. కానీ ఇపుడు విశాఖజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో అదే స్థాయిలో నేచర్ బ్యూటీ ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతుండటం విశేషం.
ఇక్కడికి వచ్చిన వారంతా ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. వచ్చిన వారు కేవలం ఇద్దరికే ఈ ప్రాంతం అందం కోసం చెబుతారు(అడిగిన వారికి, అడగని వారికి) అంతలా ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పర్యాటక ప్రాంతం. ముఖ్యంగా వ్యూపాయింట్, హిల్ పాయింట్, హిల్ వాక్, స్నో ఫారెస్ట్, స్నో క్లౌడ్ పాయింట్ లు ఈ పర్యాటక ప్రాంతంలో చెప్పుకోదగ్గర ప్రాంతాలు. ఇక్కడకు వచ్చేవారంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య కార్లు, బైకుల్లో వచ్చి. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 లేదా పది గంటల వరకూ ఉండి ఈ ప్రాంతంలో అందాలను ఆశ్వాదించి వెళతారు. పర్యాటకులు ఈ ప్రదేశాలకు వచ్చిన గుర్తుగా తమ కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధించుకుంటారు. అలా బందీ అయిన ఫోటోలు గుగూల్ సెర్చ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయంటే ఇక్కడి ప్రక్రుతి అందాలు ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వీటితోపాటు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో పర్యటించే ప్రతీఒక్కరినీ మైమరపిస్తాయి. ఈ ప్రాంతాలనికి వెళ్లే సమయంలో ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉండటంతో అక్కడ కురుస్తున్న మంచు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.. లంబసింగి చేరుకోగానే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది..ఇక్కడకి వచ్చిన వారంతా ముందుగా ఆ వన దేవతకు పూజలు చేసి తమ ప్రయాణం అంతా సరదాగా సాగాలని పూజలు చేసి అడవి ప్రాంతంలోకి అందాలను చూడ్డానికి వెళతారు. ఈ ప్రాంతానికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. చూడటానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఉండటంతో చాలా మంది ఇక్కడే జలకాలు కూడా అడుతుంటారు. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కొందరు యువకులు ఈ ప్రాంతాన్ని చూపించే గైడ్లుగా కూడా మారిపోయారు. సముద్ర మట్టానికి 1,210 మీటర్ల ఎత్తులోనున్న ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది. ఎందుకంటే ఈ లంబసింగి ప్రాంతం మొత్ం కొండ ప్రాంతం కావడం వలన అధిక చల్లదనం ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే తినుబండారాలు దొరకడంతో నర్సీపట్నం నుంచే పర్యాటకులు అన్నీ కొనుగోలు చేసుకొని పట్టుకెళుతుంటారు. ఎక్కువ సంఖ్యలో పిక్నిక్ లు కూడా ఇక్కడే జరుగుతుండటం గుర్తించాల్సిన అంశం.
అన్నట్టు చెప్పడం మరిచిపోయా ఈ ప్రాంతానికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకూ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సుల ఉంటాయి. కాకపోతే రాత్రి 12 దాటిన తరువాత వెళ్లలాంటే మాత్రం మనమే సొంతంగా వాహనాలు బుక్ చేసుకొని వెళ్లాలి...దానికోసం అటు నర్సీపట్నం నుంచి ప్రత్యేక ట్రావెల్ కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్త వారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి గుగూల్ కూడా రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుగూల్ మ్యాప్ ను పట్టుకొని ఈ ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి చేరుకోవచ్చు.. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత వెంటనే చూడాలని పిస్తుంది కదూ..ఇంకెందుకాలస్యం ఈ చలికాలంలో మీరూ ఒ ట్రిప్ లంబసింగి వెళ్లి వచ్చేయండి.. అక్కడి అందాలను తనివితీరా ఆశ్వాదించేయండి..!