అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం..


Ens Balu
48
Kotipalli
2021-06-17 11:11:17

చుట్టూ మనస్సుని హత్తుకునే పచ్చిక బైర్లు.. నింగీనేలా కలిసివున్నట్టుగా కనిపించే ఆహ్లాదకర ఆకాశం.. అటూ ఇటూ పల్లెటూరి అందాలు.. ఆ మధ్య పట్టాలపై నెమ్మదిగా కదిలే రైల్ బస్ అలా వెళుతుంటే అబ్బో అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణమే వేరండీ ..వినడానికే ఏదో సినిమా ఇంట్రోలా ఉంది కదా.. అవును నిజంగానే ఆ రైల్ బస్ జర్నీ అంతటి మంచి అనుభూతిని కలిగిస్తుంది.. ఏంటీ రైల్ బస్.. ఎక్కడుందీ ఈ రైల్ బస్  అనుకుంటున్నారా..అవునండీ మీరు చదువుతున్నది నిజమే.. మంచి పర్యాటక అందాలను పరిచియం చేసే  రైల్ బస్ నిజంగానే వుంది.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కోటి పల్లిలో ఉంది ఈ రైల్ బస్.. ఒకే బోగితో కాకినాడ నుంచి కోటి పల్లికి రోజూ తిరుగుతూ వుంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేవారంతా ఇక్కడి అందాలను తనివితీరా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కోటి పల్లి నుంచి కాకినాడ గానీ, కాకినాడ నుంచి కోటి పల్లి గానీ అయితే ఉదయం కుదరక పోతే సాయంత్రం ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు. అలా ఈ రైలు బస్ లో ప్రయాణం చేస్తేనే పైన పేర్కొన్న వర్ణన చదివిన అనుభూతి కలుగుతుంది. ఈ రైల బస్ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదు.. ప్రయాణ సమయంలోనే ఈ రైలుబస్సులోనే టిక్కెట్లు ఇస్తారు..నీట్ గా బస్సులో మాదిరిగానే సీట్లు కూడా ఉంటాయి. కాకినాడ నుంచి ఉదయం 9.30 బయలు దేరే ఈ రైలు మార్గం మధ్యలో మీకు  కొవ్వాడ, అర్తలకట్ట, కరప, వాకాడ, వేలంగి, నరసరావుపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుండూరు, గంగవరం గ్రామాలు తగులుతాయ్..చివరిగా 11 గంటలకు కోటి పల్లి చేరుకుంటాం. ఈ మార్గ మధ్యలో చాలా గ్రామాల్లో కనిపించే అందాలు నిజంగానే మాటలకు అందవు. అప్పట్లో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం పల్లెటూర్లను కలుపుతూ సరిగా లేకపోవడంతో 2004లో ఈ రైలు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. అనాటి నుంచి ఈ నాటి వరకూ ఈ రైల్ బస్ సేవలు నిరాటంకం ప్రయాణీకులకు అందుతూ వస్తున్నాయి. చాలా మంది ఈ రైల్ బస్ కోసం ప్రసార మాద్యాలు, మీడియాలో ప్రత్యేక కధనాలుగా చదివిన వారు.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఈ రైలు బస్ ఎక్కి ఆ అనుభూతి పొందుతారంటే అతిశయోక్తి కాదు.. ఇంతటి అందాలను మీరు తనివితీరా ఆస్వాదించాలనుకుంటే ఒక్కసారి కోటిపల్లి-కాకినాడ రైల్ బస్ లో ఒక్క ట్రిప్పు వేస్తే సరి..ఇంకెందుకు ఆలస్యం తూర్పుగోదావరి జిల్లా పర్యాటకాన్ని చూసే సందర్భంలో ఈ ప్రాంతాన్ని కూడా యాడ్ చేసుకోండి...ఆ పల్లె వాతావరణపు ప్రక్రుతి అందాలను తిలకించండి అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం అంటూ ఆల్ ది బెస్ట్..!