శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు బి.లక్ష్మీ సువర్ణ బృందం మంగళధ్వని కార్యక్రమం జరిగింది. తిరుమల ఆస్థానమండపంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన ఆర్.వాణిశ్రీ బృదం విష్ణుసహస్రనామ పారాయణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి పి.శైలజ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, పి.మునిరత్నంరెడ్డి అన్నమయ్య విన్నపాలు సంగీత కార్యక్రమం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు విజయకుమారి హరికథాగానం చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ భక్తి సంగీతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అన్నమయ్య కీర్తనలను రసరమ్యంగా గానం చేశారు. అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి కె.విశాలాక్షి పలు భక్తి సంకీర్తనలు చక్కగా ఆలపించారు. అదేవిధంగా, రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెదతాడేపల్లికి చెందిన గణేష్‌కుమార్ భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.