అనకాపల్లి జిల్లాలో గల రంగస్థల వృద్ధ కళాకారులకు పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. గురువారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగి, 58 సం.లు నిండిన కళాకారులు ఈ పించనుకి అర్హులని చెప్పారు. వీరికి ఏ ఇతర పింఛను రాకుండా ఉండాలని, కళాకారునిగా గుర్తింపు పత్రం, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జత చేసి వెంటనే జిల్లా కలెక్టరేట్ లో గల సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. అదేవిధంగా కళాకారుల గుర్తింపు కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వీరు రంగస్థల నాటకాలు, బుర్రకథలు తదితర కళారూపాలలో వారికి ఉన్న అనుభవము, వారిచ్చిన ప్రదర్శనల ఫోటోలు ప్రశంసా పత్రాల నకళ్ళు, స్థానికత, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రాలను జత చేయాలన్నారు.