కలెక్టర్ ను కలసిన వీరగున్నమ్మ యూనిట్..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-14 19:15:22
శ్రీకాకుళం జిల్లాలో చారిత్రక నేపధ్యం గల వీరగున్నమ్మపై చిత్రీకరిస్తున్న యూనిట్ సభ్యులు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, గిరిజన విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి మరియు వీరగున్నమ్మ చిత్రంలో జమీందారీ పాత్రధారి ప్రొ. హనుమంతు లజపతిరాయ్ నేతృత్వంలో చిత్ర యూనిట్ సభ్యులు కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో వీరగున్నమ్మ ప్రభావం, స్వాతంత్ర్య సమరంలో ఆమె చూపిన తెగువ తదితర విషయాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో కోవిడ్ నివారణకు శాయశక్తులా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ నివాస్ కు చిత్ర యూనిట్ సభ్యులు సత్కరించారు. జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మక చిత్రాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగాను, సందేశాత్మకంగాను ఉంటాయన్నారు. మందస కోటను, పరిసర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో లఖినాన వెంకటాచలం, ఎల్.రవికుమార్, ఆదిత్య భరద్వాజ్, అప్పారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు కూడా ఉన్నారు.