గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్య సిబ్బంది మ్యాపింగ్ జరగాలని ఫ్యామిలీ ఫిజీషియన్ స్టేట్ నోడల్ ఆఫీసర్ పి.నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 21 నుండి ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అమలులోకి రానున్న దృష్ట్యా మంగళవారం జిల్లాలో నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఎన్ జి ఒ సమావేశ భవనంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు అధ్యక్షతన వైద్యాధికారులకు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 21వ తేదీ నుండి ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభo అవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సచివాలయాల వారీగా ఎ.ఎన్.ఎమ్ లు, సి.హెచ్.ఒ (ఎమ్ ఎల్ హెచ్ పి) లు మ్యాపింగ్ పై పి.హెచ్.సిల వారీగా సమీక్షించారు. హెల్త్ వెల్నెస్ క్లినిక్ లలో ఉండాల్సిన మందులు, పరీక్షల పరికరాలు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.
ఇందులో పి.హెచ్.సి వైద్యుడు, ఎమ్.ఎల్.హెచ్.పి (సి.హెచ్.ఒ) , సచివాలయం ఎ.ఎన్.ఎమ్ ఒక బృందంగా వుంటారని,104 వెళ్ళే గ్రామంలో ఉదయం హెల్త్ క్లినిక్ నిర్వహించి ఒ.పి నిర్వహించి తర్వాత కదలలేని స్థితిలో వున్న రోగులను, పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహనరావు , పార్వతీపురం, సీతంపేట డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఒ లు దుర్గా భవాని, విజయ పార్వతి, ఎపిడి మియాలజిస్ట్ అనిల్ పాల్గొన్నారు.