కాకినాడ జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చట్టం పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994 అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో చట్టం అమలు తీరుపై సమావేశంలో చర్చించారు. స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు తదితరాలకు సంబంధించిన వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి
ఇప్పటివరకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో 337 ఆకస్మిక తనిఖీలు, 61 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ డివిజన్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం పరిధిలోని లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీలు అధికంగా చేపట్టాలని ఆదేశించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. కొత్తగా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటు, రెన్యువల్, చిరునామా/మెషీన్ మార్పులు, క్లోజర్ అనుమతులకు సంబంధించిన 16 దరఖాస్తులకు సమావేశం ఆమోదం తెలిపింది. పీసీ, పీఎన్‌డీటీ చట్టంపై అవగాహన పెంపొందించే పోస్టర్లను ముఖ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.
అదే విధంగా అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ-రెగ్యులేషన్) చట్టం, 2021 పరిధిలో మూడు లెవెల్-2 ఏఆర్‌టీ క్లినిక్‌ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను సమావేశం ఆమోదించింది. సమావేశంలో ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. పీవీ శ్రీనివాస్, అదనపు డీఎంహెచ్‌వో డా. ఆర్.రమేష్, అడిషనల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డా. పీబీ విష్ణువర్థిని, డీఐవో డా. అంజిబాబు, డెమో సీహెచ్ఎస్‌వీడీవీ ప్రసాద రాజు తదితరులు పాల్గొన్నారు.