కోవిడ్ వ్యాక్షిన్ పై అపోహలు వద్దు..
Ens Balu
4
Vizianagaram
2021-02-22 16:29:02
కోవిడ్ టీకా వేసుకోవడం వల్ల మనల్ని మనం రక్షించు కోవడం ద్వారా ఇతరులను కూడా రక్షించిన వారమవుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.వి.రమణకుమారి తెలిపారు. కోవిడ్ వ్యాక్షిన్ పై ఎలాంటి అపోహలు వద్దని ప్రభుత్వం అనుమతించిన మేరకే వ్యాక్షిన్ వేయడం జరుగుతుందన్నారు. సోమవారం ఆమె కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్షినేషన్ కోసం ప్రభుత్వం ఎక్కువ ప్రమాదం కలిగిన గ్రూపులను గుర్తించిందని ఇందులో మొదటిగా ఆరోగ్య సిబ్బంది, తదిపరి 50 సంవత్సరాలు పైబడి వ్యక్తులు, ఇతర ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం అవసరమున్న ప్రతీ ఒక్కరికి టీకా ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి గ్రూపులో వారికి ఇప్పటికే జిల్లాలో మొదటి డోసు క్రింద ఆరోగ్య, రెవెన్యూ, పంచాయితీరాజ్ తదితర శాఖల వారికి 70 శాతం వరకు టీకా వేయడం జరిగిందని తెలిపారు. తొలి డోసు వేసిన 28 రోజులకు రెండవ డోసు వేయడం జరుగుతోందన్నారు. రెండు డోసులు వేయించుకున్నప్పుడు మాత్రమే టీకా పూర్తిగా వేయించుకున్నట్లు పరిగణించడం జరుగుతుందన్నారు. రెండవ డోసు పూర్తి అయిన రెండు వారాల తరువాత వ్యాధి నుంచి రక్షించగల స్థాయిలో శరీరంలో యాంటీబాడీలు అభివృద్ది చెందుతాయన్నారు. కోవిడ్ సోకి కోలుకున్న వారు కూడా రెండు డోసుల టీకా వేయించుకోవడం వలన వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. టీకా వేయించుకోదలిచిన వారు ఏదైనా గుర్తింపు కార్డుతో తమ పేరును ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న తరువాత వారి మెబైల్ నెంబరుకు టీకా వేసే తేది, సమయం తెలియజేస్తారని తెలిపారు. కోవిడ్ టీకా సురక్షితమైనదని ఏలాంటి దుష్ప్రభావాలు వుండవని స్వల్ప జ్వరం కొద్ది మందికి వారవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. పత్రికా సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక అధికారి డా.ఎం.నారాయణ, డెమో తదితరులు పాల్గొన్నారు.