క్రిటికల్ కేసులు తక్షణమే గుర్తించాలి..


Ens Balu
4
Srikakulam
2021-03-12 15:51:48

ప్రభుత్వ ఆసుపత్రల్లో క్రిటికల్ గర్భిణి కేసులు ముందుగానే గుర్తించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్య అధికారులతో శుక్రవారం సమీక్షించారు. క్రిటికల్ కేసులు గుర్తించక మరణాలకు గురి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రత్యేక బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నారని నివారించదగ్గ కేసులు నిర్లక్ష్యం కారణంగా మరణాలకు గురికారాదని ఆయన అన్నారు. సరైన సమయంలో స్పందించాలని పేర్కొన్నారు. పిహెచ్సి లలో అన్ని సౌకర్యాలు, వైద్యులు ఉన్నప్పటికీ ఒక్క ప్రసవం కూడా చేసిన ఆసుపత్రులు లేవని ఆయన తెలిపారు. వీరఘట్టం పిహెచ్ సి, పనితీరును ప్రశంసించారు. రేగిడి ఆమదాలవలస, రావాడ, తిలారు, ఎచ్చెర్ల, కళింగపట్నం, కొత్తపల్లి, దూసి తదితర పిహెచ్సి లలో గత మూడు నెలలుగా ఒక్క ప్రసవం కూడా చేయకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు. వైద్యులుగా గర్భిణీలకు భరోసా కల్పించాలని ఆయన తెలిపారు. అన్ని పిహెచ్ సి లలో ప్రసవాలు జరగాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఎన్ఎంలు గ్రామ సచివాలయంలో ఉండాలని ఆయన తెలిపారు. వాక్సినేషన్ పెద్ద ఎత్తున జరుగుటకు వైద్యులు కృషి చేయాలన్నారు. నాడు - నేడు పనులు : ఆసుపత్రుల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు నాడు - నేడు పనులు ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో అన్ని గదులు శుచిశుభ్రతలతో ఉండాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, లేబర్ రూమ్ లపై శ్రద్దవహించాలని, విద్యుత్తు, పెయింటింగ్ లు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రహారి గోడ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఖర్చుతో నిర్మించినప్పటికి కిటికీ తలుపులు సక్రమంగా మూయక పోవడం తదితర సంఘటనలు జరగరాదని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు., ఆర్ అండ్ బి ఎస్ ఇ కె.కాంతిమతి, ఏపీఎంఐడిసి డిఇ ప్రసాద్, వైద్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.ఏ.అనురాధ, డా.లీల, డా.ఎన్. ఏ.వి.వి.వి.పి.రామి రెడ్డి, డా.ప్రకాష్, వీర్రాజు, ఇంజినీరింగ్ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.