కు.ని శస్త్రచికిత్సల లక్ష్యాలు అదిగమించాలి.
Ens Balu
3
Kakinada
2021-03-12 18:00:42
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, నిర్వహణలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి నాణ్యత హామీ కమిటీ (Qualty Assurance Committee) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేసిన శస్త్రచికిత్సల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 2019-20లో 251 వ్యాసెక్టమీ, 18,344 ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. అదే విధంగా 2020-21లో 2021, ఫిబ్రవరి వరకు 56 వ్యాసెక్టమీ, 11,763 ట్యుబెక్టమీతో మొత్తం 11,819 ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కేసుపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి శస్త్రచికిత్సలను విజయవంతం చేసేందుకు కృషిచేయాలని ఆదేశించారు. గతంలో శస్త్రచికిత్సల సందర్భంగా ఏవైనా సంక్లిష్టతలు చోటుచేసుకుంటే వాటిని విశ్లేషించాలన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ప్రక్రియ బాగా జరుగుతోందని.. అత్యంత అరుదుగా ఏవైనా ప్రతికూల సంఘటనలు ఎదురైన సందర్భాల్లో నిబంధనల మేరకు పరిహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో నివేదికల రూపకల్పన కచ్చితత్వంతో ఉండేలా చూడాలని కలెక్టర్.. అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు, అదనపు డీఎంహెచ్‌వో డా. ఎన్.ప్రసన్నకుమార్, ఆర్ఎంవో డా.గిరిధర్, ఐఎంఏ ప్రతినిధి డా. వి.రవి తదితరులు హాజయ్యారు.