పైలట్ సచివాలయంలోనే వేక్సిన్..


Ens Balu
5
Poranki
2021-03-17 19:04:03

క్రిష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పోరంకి సచివాలయాల పరిధిలోని ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు. కోవిడ్ కేసులు తిరిగి నమోదుకావడంపై కలెక్టరు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛధంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ ఇటీవల తిరిగి కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. గత 10 రోజుల్లో జిల్లాలో 186 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజల్లో కోవిడ్ పట్ల భయం లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్పష్టంగా కనబడుతోందన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలో కరోనాకేసుల నమోదు స్ధాయి తగ్గి, గత పదిరోజుల్లోనే జిల్లాలో 186 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పోరంకి సచివాలయాల పరిధిలో ప్రతీ ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోవడంతోపాటు భౌతికదూరం పాటించడం, మాస్క్ ఉపయోగించడం, శానిటైజర్ తప్పనిసరి అన్నారు. జిల్లాలో ఇప్పటికే లక్షమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ వేశామని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. తొలిదశలో మెడికల్, మున్సిపల్, పోలీస్, తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు జిల్లాకు సరఫరా అయిన కోవీషీల్డ్, కోవ్యాక్సిన్ వేశామన్నారు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్ డోస్‌లు వస్తున్నాయన్నారు. ప్రజలు స్వచ్ఛధంగా వ్యాక్సినేషన్ వేయించుకోవడంతోపాటు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ చేయించుకున్న లక్షమందిలో ఎ లాంటి దుష్ప్రభావం చూపలేదన్నారు. ప్రజలు అపోహలు వదిలి వ్యాక్సినేషన్‌కు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి నిర్భయంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. తద్వారా భవిష్యత్తులో కరోనా బారిన పడకుండా ఉండగలుగుతామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 40 రోజుల్లో యాంటీబాడీస్ పూర్తిగా అభివృద్ది చెందుతాయన్నారు.