వైరాలజీ ల్యాబ్ సేవలు ప్రశంసనీయం..
Ens Balu
3
Kakinada
2021-03-18 18:47:29
రంగరాయ మెడికల్ కళాశాల మైక్రోబయాలజీ విభాగ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్) గతేడాది మార్చి 18న జీజీహెచ్‌లో కోవిడ్-19 పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిందని, కోవిడ్ సంక్షోభ కాలంలో ఈ కేంద్రం అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్ పరీక్షలు ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా గురువారం కాకినాడలోని జీజీహెచ్‌లో మైక్రోబయాలజీ విభాగ వీఆర్‌డీఎల్ ప్రత్యేక నిరంతర వైద్య విద్య (సీఎంఈ) కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. కోవిడ్-19పై వైద్య విద్యార్థులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదట్లో కోవిడ్ పరీక్షల నిర్వహణకు శాంపిళ్లను పుణె పంపించాల్సి వచ్చిందని, తర్వాత కాకినాడ జీజీహెచ్‌లో కోవిడ్-19 పరీక్షల కోసం ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు ప్రజల అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఈ ల్యాబ్ ఎదిగిందని ప్రశంసించారు. ఇప్పటి వరకు ఈ కోవిడ్-19 పరీక్షల కేంద్రం 5,60,595 ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేసినట్లు వివరించారు. ఇక్కడ అత్యంత కచ్చితత్వంతో వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. దాదాపు 30 శాతం వరకు పాజిటివిటీ ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, భయాందోళనలు చెందకుండా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ డీఎస్ మూర్తి ఆధ్వర్యంలో ల్యాబ్ సిబ్బంది అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కోవిడ్ లక్షణాలున్న వారిని చేర్చుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులు వెనుకాడేవని, అలాంటి సమయంలో ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజల్లో ధైర్యం నింపి, వైద్య సేవలు అందించారన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు ప్రచారం చేసే వారితో బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని , ప్రతి ఒక్కరూ కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
*ల్యాబ్ ద్వారా విశేష సేవలు: జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి
వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీ (వీఆర్‌డీఎల్)కి చెందిన కోవిడ్-19 పరీక్ష కేంద్రం కోవిడ్ విపత్తు సమయంలో విశేష సేవలందించిందని, మొత్తం బృందానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు జేసీ (డీ) కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాత్రి పగలు అనక బృంద సభ్యులు పనిచేశారన్నారు. కోవిడ్ పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్/డీహెచ్ఆర్ నుంచి ఆమోదం పొందిన రాష్ట్రంలో రెండో ల్యాబ్‌గాగా ఈ ల్యాబ్ నిలిచినట్లు జేసీ తెలిపారు. కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాబ్జీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్. మహాలక్ష్మి, మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డా. జి.రత్న, వైద్యవిద్య బోధనా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.