అర్బన్ హెల్త్ సెంటర్లకు చురుగ్గా ఏర్పాట్లు..
Ens Balu
4
Visakhapatnam
2021-03-19 15:40:30
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధితో పాటు జిల్లాలో రెండు చోట్ల అర్భన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. శుక్రవారం విశాఖలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 72 హెల్త్ సెంటర్లు జివిఎంసీ పరిధిలోనూ, యలమంచిలిలో రెండు, నర్సీపట్నంలో మూడు సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే ఈ కేంద్రాలకకు సంబంధించిన వసతి సౌకర్యం దాదాపు పూర్తయిందన్నారు. ఇంకా 24 కేంద్రాల ఏర్పాటుకి స్థలాలు సేకరిస్తున్నామని, అవికూడా రెండు మూడురోజుల్లో పూర్తవుతాయన్నారు. కాగా ఈ కేంద్రాల్లో శాస్వత ప్రాతిపదికన వైద్యుల నియామకం చేపట్టి నట్టు చెప్పారు. ఖాళీగా ఉన్న 11 డాక్టర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కు నివేదించామన్నారు. ఒక్కో హెల్త్ సెంటర్ లో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్ నర్సు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తారని వివరించారు. ఈ కేంద్రాల వలన జిల్లా ఆసుపత్రులపై భారం తగ్గడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నిరుపేదలకు స్వాంతన చేకూరుతుందన్నారు. ఈ కేంద్రాల ఏర్పాటు పూర్తయిన తరువాత ఆయా వార్డుల పరిధిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం వైద్యసేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు ఎంతో వేగంగా జరుగుతుందని డీఎంహెచ్ఓ మీడియాకి వివరించారు.