పంపనూరులో శిలాయుగం నాటి రాతి చిత్రాలు ..


Ens Balu
2
పంపనూరు
2020-12-25 16:04:20

అనంతపురం జిల్లా పంపనూరులో రాతియుగానికి చెందిన చిత్రాలు శుక్రవారం వెలుగుచూశాయి. దీంతో అనంతపురం ఆర్కిలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత, విశ్రాంత డిప్యూటి కలెక్టర్ జి.బి.విశ్వనాథ, బళ్ళారికి చెందిన చరిత్ర అభిమాని లింగన్నస్వామి, గుత్తికోట టూరిస్ట్ గైడ్ రమేష్ లతో కూడిన బృందం అత్మకూరు మండలంలోని పంపనూరు నరసింహ దేవాలయం వద్దగల గుట్టలలో, విడపనకల్లు మండలంలోని వేలుపుమడుగు కొండలలో వీటి ఆచూకి ని కనుగొన్నారు. మధ్య నవీన శిలాయుగానికి (మెసోలితిక్ కాలానికి) చెందిన చిత్రాలలో బాణంతో ఎద్దును వేటాడుతున్న దృశ్యం, సామూహిక వేట, నెమళ్ళు,సామూహిక నృత్యం మొదలైన  రాక్ ఆర్ట్  డ్రాయింగ్స్  ఇందులో ప్రధానమైనవిగా ఉన్నాయి. దాదాపు 10 వేల సంవత్సరాల పూర్వానికి చెందిన ఈ చిత్రాలను కొసిగా వున్న రాయితో మలచడం జరిగింది. పరిణామ క్రమంలో మానవుడు సాధించిన ప్రగతి ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చును. వేటలో విల్లంబుల ఉపయోగం, సామూహిక వేట, సామూహిక నృత్యం వారి పరిణామ దశకు తార్కాణం. నెమళ్ళు, మొదలైన చిత్రాలు చెక్కడం వలన ప్రకృతిపట్ల వారికి గల అవాగాహన పరిశీలన తెలియచేస్తోంది. గుహలలో పెయింటింగ్స్ వేయటాన్ని ఆంగ్లంలో పెట్రోగ్లోఫి అంటారు. ఇలాంటి చిత్రాలు ఉరవకొండ సమీపంలోని బూదగవి కొండగుహలో ఉన్నాయి. చిత్రీకరణకు తేనేపట్టు, జంతుకొవ్వు, రంగుశిలలను వాడి వుంటారని విశ్రాంత డిప్యూటి కలెక్టర్ విశ్వనాథ అభిప్రాయపడ్డారు. వీరు ఎద్దులు, దున్నపోతులు, జింకల, దుప్పులు,నెమళ్ళు, కొండగొర్రెలు, ఏనుగులు మొదలైనవి వేటాడేవారని ఆయన అభిప్రాయపడ్డారు. పదునైన రాయితో చెక్కిన చిత్రాలను ఫిక్టోగ్రాఫ్స్ అంటారు. ఈ చిత్రాలు పంపనూరు, వేలుపుమడుగులలో వున్నాయి. వేలుపుమడుగులో లింగన్న స్వామి సాయంతో ఆర్కియాలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాచీన మానవుడు ఉపయోగించిన రాతిగొడ్డలి, వడిసెలరాల్లు, మాంసం కోసేందుకు గీకేందుకు ఉపయోగించిన బ్లేడ్లు సేకరించారు.ఇక్కడ పడుకొన్న మనిషికి సాయం చేస్తున్న మరో మనిషిచిత్రం ఉండటం విశేషం.రాతిపనిముట్లను పదునుపెట్టె గ్రూ లేదా రాతిచీలిక వేలుపుమడుగు పర్వతపాదంలో కనుగొనడం విశేషమని చెప్పాలి. వేలుపుమడుగు కొండల్లో స్టోన్ మైనింగ్ జరిగి రాతిచిత్రాలు పాడైపోయాయి. ఇందులో వున్న చిత్రాలను గ్రామస్థులే కాపాడుకోవాలి. పంపనూరు ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడి గుట్టలలోని రాతి చిత్రాల ప్రాముఖ్యం తెలుసుకోలేక, వాటిపై రంగులతో ( paintings) పేర్లు వ్రాసి చాలా వరకు రాతి చిత్రాలను పాడుచేశారు. వీటిని కూడా గ్రామస్తులే కాపాడుకోవాలని సూచించారు.