నోరూరించే కాకినాడ కాజా ఒక్కసారి తింటే..


Ens Balu
29
Kakinada
2021-09-26 08:08:59

తూర్పుగోదావరి జిల్లాలో మీది ఏఊరు అని అడిగేవారంతా కాకినాడ అని అవతలివారు చెప్పే సమాధానం కోసం ఆశగా ఎదురుచూస్తారు. ఎందుకు తెలుసా అది వ్యక్తుల కోసం కాదు..అక్కడ బాగా ఫేమస్ అయిన కాకినాడ కాజా కోసం..వస్తూ వస్తూ మాకో కేజీ కాకినాడ కాజీ తేవచ్చు కదా అని లొట్టలేసుకుంటూ అడగటానికి అంతలా కాకినాడ కాజా ఫేమస్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కాజా అంటే కాకినాడ, కాకినాడ అంటే కాజా అన్నంత పేరు సంపాదించుకుందంటే ఈ కాజా కధ కమామిషు అంతా ఇంతా కాదు. ఈ కాజాని స్రుష్టించిన  కోటయ్య అనే పేరగల వ్యక్తి మొదట్లో అంతా కోటయ్యకాజా కోటయ్యకాజా అనేవారు. అదికాస్తా కాలక్రమంలో కాకినాడ కాజాగా రూపాంతరం చెందినది. కాకినాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఏ శుభకార్యాలు జరిగినా ఈకాజాలేని తీపి ఉండదంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా కాజా అంటే మడతలు చుట్టి వుంటుంది. కానీ కాకినాడ కాజా మాత్రం గుండ్రంగా నున్నగా వుంటుంది. లోపల దాని పొట్టనిండా తియ్యని పాకం నిండివుంటుంది. ఇదీ ప్రత్యేకత. ఈ టేస్టుకోసమే మిఠాయిప్రియులందరూ కాకినాడలోకి అడుగు పెట్టగానే నోరూరే రుచిని తీపి చేసుకోవడానికి ఒక గుటకలో కాకినాడ కాజాని కొరికిపడేస్తారు. ప్రస్తుతం ఈ కాజాలు అన్ని దేశవ్యాప్తంగా దొరుకుతున్నా ఎక్కడి వెళ్లినా కాకినాడ కాజా అంటేనే దీనిని ఇస్తారు అంతలా మంచి పేరుపొందిందీ ఈకాజా. ఇంత స్టోరీ చదివిన తరువాత లేదా విన్న తరువాత మీకూ కాకినాడ కాజా రుచిచూడాలని వుంది కదా. కాకినాడ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడి కాజాని రుచిచూడకుండా మాత్రం వెనుతిరగకండి.