ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరి లక్షణాలతోనే మరో రెండు ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా.. వ్యయప్రయాసలకోర్చి తిరుమల వెళ్లలేని భక్తుల కోసం నేరుగా ఆ కలియుగ బాలాజీగా పిలుచుకునే వేంకటేశ్వర స్వామి ఉబయగోదావరి జిల్లాలకు తరలి వచ్చారని చరిత్ర చెబుతోంది.. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం కాగా, మరొకటి తూర్పు గోదావరి కి చెందిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవ స్థానం..తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ తరహా ఫలితాలొస్తాయో.. అవే ఫలితాలు ఇక్కడి శ్రీవారిని దర్శించుకున్నా కలుగజేయడానికే స్వామి ఇక్కడ వెలసారనేది భక్తుల నమ్మకం. ప్రాచీన కాలంలో అప్పన అనే భక్తుడు స్వామివారి గురించి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వల్ల ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని అంటారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వేదభ్యసానికి, ఆధ్యాత్మికతకు కొలువైన నిలయం. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ఇది. స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే పూజ కార్యక్రమాలు, ఎంతో విశేషంగా ఉంటాయి.
ఇక ఈ పుణ్యక్షేత్రానికి స్వామివారు రావడానికి కారకుడు రామస్వామి అనే భక్తుడు. ఆయన ఈ గ్రామంలో కొబ్బరి కాయల వ్యాపారం చేస్తూ వచ్చిన లాభాలలో కొంత మొత్తాన్ని స్వామికి కేటాయిస్తూ ఉండేవాడు. ఆ డబ్బుతో తరచూ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. వయస్సు పైబడిన కారణంగా ఆయన తిరుమల వెళ్ళలేక ఆవేదన చెందాడు. దాంతో త్వరలో తానే ఆ గ్రామానికి వస్తున్నట్లుగా శ్రీనివాసుడు కలలో ఆయనకి చెప్పాడు.. దాంతో రామస్వామి సంతోషంతో పొంగిపోయాడు. తన కొబ్బరికాయలను దుకాణంలోనే స్వామివారి నిలువెత్తు చిత్రపటం ఉంచి పూజించడం మొదలు పెట్టాడు. ఆ చిత్రపటం నేటికీ ఆలయంలోని ప్రత్యేక మందరిలో దర్శనమిస్తుంది. స్వామి ఆదేశం మేరకు ఈ గ్రామంలో ఆలయ నిర్మాణం 1960లో జరిగింది. ఈ ఆలయానికి 1960లో బీజం పడింది.1960 నుంచి 1980 వరకూ ఈ ఆలయ నిర్వహణ రామస్వామి ఆధ్వర్యంలోనే సాగింది. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.
పాత ఆల యాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో కొంతస్థలం కొనుగోలు చేసి నూతన ఆలయ నిర్మాణానికి రామస్వామి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 1970 మార్చి18న శంకుస్థాపన చేశారు. 1991 జూలై 4న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయానికి మూలవిరాట్టును ఉచితంగా అందించింది. ఈ ఆలయంలో పద్మావతి, ఆండాళ్ తాయార్, గరుడాళ్వార్ విగ్రహాలను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి నూతన ఆలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి దేవస్థానం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అప్పనపల్లి కాకినాడ కు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 85 కి. మీ ల దూరంలో, అమలాపురం కు 35 కి. మీ ల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రావులపాలెం మీదుగా (110 కి.మీ) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.