మహిళా ఉద్యోగులకు ప్రసూతి శాపం.. సర్వీసు రెగ్యులైజేషన్ కి నిభందనల కళ్లెం..


Ens Balu
8
Tadepalli
2021-11-11 02:32:51

రాజు తలచుకుంటే డబ్బులకు, దెబ్బలకు కొదవే వుండదనే నానుడి మీకు గుర్తుండే వుంటుంది.. రాష్ట్రప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగులూ చేయని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులు సాధారణ సెలవుదినాల్లోనూ ఉచితంగా చేసే అధనపు విధులు చూస్తే అచ్చు అదే గుర్తుకు వస్తుంది అందరికీ.. ఏంటీ ఏదో తేడా కొడుతుంది అనుకుంటున్నారా..నిజంగానే తేడా కొట్టింది.. ప్రభుత్వ సెలవుల్లో ప్రత్యేకంగా అదనపు విధులు విధులకు పిలిచి సాధారణ ఉద్యోగ సమయం కంటే అధికంగా  పనిచేయించుకోవడానికి అడ్డు రాని నిబంధనలు హఠాత్తుగా ప్రభుత్వానికి ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి నిభందనలు అడ్డువచ్చాయని వారిని ఓ ఆరు నెలలు వెనక్కి నెట్టేందుకు చూస్తున్నారు అధికారులు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం సాధారణ సెలవుల్లో ఉద్యోగులకు అదనపు విధులు ప్రభుత్వం అప్పగించకూడదు. అలా తప్పక అప్పగిస్తే చేసిన పనికి లెక్క కట్టాలి.. అది జీతంతోపాటు కలిపి ఇవ్వాలి. కానీ అది గ్రామ, వార్డు సచివాలయ శాఖలో జరగదు, ప్రభుత్వానికి అసలు ఆ నిబంధనే గుర్తులేదు. ప్రభుత్వ ఉద్యోగులకు దొరికే ఆ ఒక్కరోజు ఆదివారం, లేదా రెండవ శనివారాల్లోనే ప్రభుత్వానికి, సచివాలయ శాఖలో మిలితంగా వున్న 11 ప్రభుత్వ శాఖలకు అత్యవసరంగా పని పడుతుంది. అనుకున్నదే తడువుగా జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో వారికి ఆ సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా డ్యూటీలు వేస్తారు. అదేమంటే చెప్పింది చేయడమే మీ పని.. దానికి లాజిక్కులు, జీఓలు, రూల్సు మాట్లాడకూడదు అంటూ బెదిరింపులకు దిగుతారు అధికారులు. అసలే కొత్తగా వచ్చిన ఉద్యోగం, పూర్తిస్థాయిలో జీతం రాకపోయినా ఇచ్చే ఆ రూ.15వేలతో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే సచివాలయ ఉద్యోగులకు ఇపుడు వారానికి దొరికేది ఒక్కరోజు సాధారణ సెలవులు ఇంట్లో కనీసం బట్టలు ఉతుక్కునే అవకాశం కూడా లేకుండా ఆదివారం, రెండవ శనివారాలు ప్రత్యేకంగా చేసే ఉచిత విధులకే పోతున్నాయి. అయినా పర్లేదు ప్రభుత్వం తమని గుర్తిస్తుందీ అనుకుంటే ఇపుడు గుండెలపై బండరాయి వేసింది. అదే రెండేళ్ల కాలంలో ప్రసూతి సెలవులు మహిళా ఉద్యోగులు పెట్టుకున్న ఆ సెలువులు పూర్తయ్యే వరకూ సర్వీసు రెగ్యులైజేషన్ పూర్తికాదనే అతి బరువైన మాట. 

తోటి ఉద్యోగులంతా రెండేళ్లు పూర్తికాగానే వారి సర్వీసులు రెగ్యులర్ అయిపోతున్న తరుణంలో మహిళా ఉద్యోగులు మాత్రం తమకు మాత్రుత్వం మిగిల్చిన కష్టంతో మరో ఆరు నెలలు వేచి వుండే పరిస్థితి దాపురించింది. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అనే నిబంధన ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తాయి. కానీ రాష్ట్రప్రభుత్వంలోని ఒక్క సచివాలయ శాఖలోనే ఆ నిబంధన అమలు కాలేదు. కాదు కాదు అమలు చేయలేదు. సెలవు రోజుల్లో  అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వానికి ఆ సమయంలో గుర్తుకి రాని నిబంధనలు..తీరా తమ సర్వీసులు రెగ్యులర్ చేసే సమయానికి మాత్రం అసలైన జీఓలన్నీ తెరపైకి వస్తున్నాయంటూ మహిళా ఉద్యోగులు కన్నీరు మున్నీరవుతున్నారు. గర్భం దాల్చిన సమయంలోనూ తమతో సెలవు రోజుల్లోనే ప్రత్యేకంగా ఉచితంగానే అదనపు విధులు చేసేలా చేసిన మండల, జిల్లా అధికారులు ఇపుడు తీరా సర్వీసు రెగ్యులైజేషన్ సమయం వచ్చేనాటికి మాత్రం నోరు మెదపడం లేదని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని సుమారు లక్షా 24 వేలకు పైగా వున్న ఉద్యోగుల్లో 50శాతం వున్న మహిళా ఉద్యోగుల్లో ప్రసూతి సెలువులు పెట్టిన వారికి సర్వీసులు మరో ఆరు నెలలు పొడిగించే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు రెండేళ్లు పూర్తయిన వారందరికీ సర్వీసు క్రమబద్దీకరణ చేస్తున్న తరుణంతో ఈ ప్రధాన అంశం తెరపైకి వచ్చింది. మెటర్నటీ లీవుతోపాటు, మెడికల్ లీవులు పెట్టిన వారికి సైతం సదరు సెలవులు పూర్తయ్యే వరకూ వారియొక్క సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వానికి తమ తప్పులేదని చెప్పే ఉద్దేశ్యంలో మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను, ఇతరుల మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా వారికి సర్వీసులు రెగ్యులర్ చేయాలని ఒక అర్జీ పెట్టి ఊరకుండిపోయింది. అర్జీతోపాటు రెండేళ్లుపాటు కరోనా వైరస్ భయంకరంగా విజ్రుంభించిన వేళ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని గానీ, ప్రస్తుతం కూడా సాధారణ సెలవుల్లోకూడా ఉచితంగానే అదనపు విధులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని గానీ, రెండేళ్లలో పేస్కేలు జీతంలో చాలా కోల్పోయారని కానీ, ప్రత్యేక సమయంలో అదనపు పనిగంటలు కార్యాలయాల్లో పనిచేస్తున్నారని గానీ, కోవిడ్ వేక్సినేషన్ లో ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నారనే అంశాలను ఆ అర్జీలో పొందు పరచలేదు. సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేయించుకుందో వాస్తవానికి ప్రభుత్వానికే తెలియాలి. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత రికార్డుస్థాయిలో కోవిడ్ సమయంలోనూ ఉద్యోగులు పనిచేశారని, చాలా మంది కోవిడ్ భారిన పడి ప్రాణాలు కూడా కోల్పోయారని.. ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ చేసే సమయంలో నిబందన కొర్రీలు పెట్టడం చాలా ఆవేదనకు గురి చేస్తుందని సచివాలయ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అందునా మహిళా ఉద్యోగులైతే బిడ్డలకు జన్మనిచ్చిన సమయంలో తీసుకున్న సెలవులే తమకు శాపాలయ్యాయని పడుతున్న బాధ వర్ణణా తీతం. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధంగా అయితే సర్వీసు నిబంధనలను పక్కన పెట్టి సాధారణ సెలవుల్లోనూ, కరోనా స్పెషల్ డ్యూటీ, రెండవ శనివారాల్లో ఇంటింటి సర్వేలు, పంచాయతీ పన్నులు వసూళ్లు, మదింపులు విధులు సచివాలయ ఉద్యోగులతో ఉచితంగానే చేయించుకుందో..అదే రీతిగా వీరి ప్రసూతి, మెడికల్ లీవ్ లను పరిగణలోకి తీసుకోకుండా రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులకు సర్వీసులు రెగ్యులర్ చేయాల్సి వుందని పరిశీలకులు భావిస్తున్నారు. చూడాలి.. అదనపు పని చేయించుకోవడానికి నిబంధనలు అడ్డురావు కానీ.. సర్వీసు రెగ్యులైజేషన్ కి మాత్రం ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయని చెబుతుందా.. లేదంటే ప్రభుత్వం కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం సెలవు రోజుల్లో చేసిన అదనపు సెలవులను గుర్తుంచుకొని అందరికీ రెండేళ్లు పూర్తికాగానే ప్రొబేషన్ డిక్లేర్ చేసి సర్వీసులు రెగ్యులర్ చేస్తుందో..!