ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే.. జర్నలిస్టులు.. మీడియాకి మన బాధలు చెప్పుకుంటేనైనా అపుడుగాని ఎవరూ దారిలోకి రారు..అని ఎంతో దైర్యంతో, నమ్మకంతో మీడియా దగ్గరకి వస్తారు ప్రజలు.. తాము అధికారంలో ఉండగా చేసిన పనులు ప్రజలకి తెలియాలన్నా కూడా అదే ప్రజాప్రతినిధులు కూడా మీడియా ద్వారా ప్రచారం పొందుతారు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని వార్గాలకు తెలియజేయాలన్నా ప్రభుత్వాల గొప్ప తెలియాలన్నా కూడా మీడియా, జర్నలిస్టులే అవసరం. అలాంటి మీడియాలో పనిచేసే జర్నలిస్టుల భవిష్యత్తు ఇపుడు ప్రశ్నార్ధకం అయ్యింది. అన్నివర్గాలకు అవసరాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకోవడంలో అత్యంత దారుణంగా విఫలం అవుతున్నారు. సాధారణ ప్రజల కంటే దారుణంగా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చుట్టూ అర్జీలు పట్టుకొని తిరుగుతున్నా నేటికీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ఒకప్పుడు జర్నలిస్టు అంటే ఎంతో రాజభోగం, కానీ నేడు పరిస్థితి పూర్తిగా పోయింది. సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన టెక్నాలజీ, సోషల్ మీడియా జర్నలిస్టుల భవితవ్యాన్ని త్రిశంఖు స్వర్గంలో పడేశాయి. ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి మీడియా కంటే సోషల్ మీడియా అంటనే మక్కువ పెరిగిపోయింది. దానితో జర్నలిస్టులు, వారి సమస్యలను పరిష్కరించడాన్ని ప్రభుత్వాలు లైట్ తీసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా మీడియాలో పనిచేసే జర్నలిస్టుకి అత్యంగ గౌరవంగా ప్రెస్ అక్రిడిటేషన్ కార్డు వచ్చేది. సదరు పత్రికకు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. కానీ ఇపుడు మీడియా కూడా రాజకీయం అయిపోవడంతో..ఎవరి సామాజిక వర్గం అధికారంలో ఉంటే సదరు సామాజిక వర్గం మీడియాకి అగ్రతాంబూలం ఇచ్చి స్థానిక పత్రికలను పూర్తిగా ప్రక్కన పెట్టేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు చెప్పే కారణం కూడా ఒక్కటే మీ పత్రికకు డిఏవీపీలేదు, ఎంపానల్ మెంట్ లేదని.
అలాగని ఎంపానల్ మెంట్ కి, డిఏవీపికి సరిడేంత కాలం పత్రికలు దిగ్విజయంగా నడిపి దరఖాస్తు చేసుకున్నా వాటిని పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతుందని చెప్పి ఒకసారి.. ప్రస్తుతం ప్రజల సమస్యలపై దృష్టిపెట్టామని మరోసారి.. పదేళ్లపాటు డిఏవీపీ, ఎంపానల్ మెంట్ పై బ్యాన్ విధించామని మరోసారి, మీ పత్రికకు కావాల్సిన అనుబంధ పత్రాలు సక్రమంగా లేవని మరోసారి చెబుతూ కాలం వెల్ల దీస్తున్నారు తప్పితే అన్నీ సక్రమంగా ఉన్న పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనలు వచ్చే ఎంపానల్ మెంట్ మాత్రం సక్రమ మార్గంలో చేయడం లేదు. మరోవైపు స్థానిక పత్రికలను పూర్తిగా పాతాలళ లోకానికి తొక్కేసే విధంగా ప్రభుత్వ జీఓలు రూపొందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 జర్నలిస్టులకి ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్లను కుదించేశాయి. ఒకప్పుడు మండల విలేఖరికి కూడా ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ ఇపుడు నియోజకవర్గానికి ఒకటి కూడా ఇచ్చే పరిస్థితి లేదు.
పెద్ద పత్రికలు, ఎడిషన్లు ఎక్కువగా వుంటే ఒకలా, స్థానిక పత్రికలు అయితే మరోలా... 8పేజీలు పేపర్ అయితే ఒకలా, నాలుగు పేజీల పేపర్ అయితే ఇంకోలా.. 12 పేజీల డమ్మీసైజ్ పేపర్ అయితే వేరే రకంగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి జర్నలిస్టులకు అసలు మీడియా అంటేనే విరక్తి పుట్టేలా చేసి.. స్థానిక పత్రికలపై భారం మోపుతున్నారు. అలాగనీ చచ్చీ చెడీ పెళ్లాం మెడలో పుస్తులు తాకట్టు పెట్టి కూడా పేపర్ నిర్వహణ సక్రమంగా చేసినా కూడా సమాచారశాఖ ద్వారా ఏవేవో కొర్రీలు వేస్తూ స్థానిక పత్రిక నిర్వాహకుల ఆత్మస్తైర్యం, రెగ్యులారిటీకి గాలి తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పాటించలేని స్థానిక పత్రికలు వారంటత వారే మూసేసుకుంటున్నారు. మరికొందరు అమ్మేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన వారు చచ్చీ చెడీ అప్పులు చేసి మరీ పత్రికలను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పత్రికల్లో కూడా జర్నలిస్టులకు పనిచేసినందుకు జీతాలు లేకుండా పోయాయి..
కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ గౌరవానికైనా నోచుకుందామని నిర్వహిస్తున్న పత్రికలకు ఆర్ఢిక భారం రోజు రోజు కీ పెరిగి పోతున్నది తప్పితే మరొకటి లేదు. ఉదాహరణకు సుమారు 20ఏళ్లుగా జర్నలిస్టులు కనీసం ఇంటి స్థలాలకు నోచుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇదే సమస్యపై జర్నలిస్టులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రికి విన్నవించినా ఫలితం లేకుండా పోతున్నది. ప్రస్తుతం జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పొందే అవకాశం లేకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు వారికి, వారి సామాజిక మీడయాలకి అనుగుణంగా నిబంధనలు మార్చేస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా స్థానిక పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి. అయితే గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో మాత్రం మండల జర్నలిస్టుకి ఒక అక్రిడిటేషన్ మంజూరు చేసింది.
కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ఏకంగా పత్రికకు కేవలం 6 అక్రిడిటేషన్లతో కుదించేశారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇపుడైనా జర్నలిస్టుల ప్రధార గుర్తింపు ప్రెస్ అక్రిడిటేషన్, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇంటిస్థలం మంజూరు అవుతుందా..అనే ఆశతో ఉన్న జర్నలిస్టులు లేదంటే మళ్లీ సాధారణ ప్రజానీకం మాదిరిగానే అర్జీలు పట్టుకొని కలెక్టరేట్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం వరకూ అర్జీలు పెట్టుకోవడమే జర్నలిస్టుల కర్తం అయిపోతుంది. అయినా జర్నలిజం వర్ధిల్లాలి..జర్నలిస్టు అభివృద్ధి చెందాలి.. లాంగ్ లివింగ్ మీడియా..జైహింద్ ఫోర్త్ ఎస్టేట్..!