మహిళా పోలీసులను కరుణించిన కూటమి..?!


Ens Balu
7
visakhapatnam
2025-09-17 21:45:35

గ్రామ, వార్డు సచివాయ మహిళా పోలీసుల మొరను కూటమి సర్కారు ఆలకించి కరుణించింది.. వీరి సమస్యలపై నిత్యం ఈరోజు-ఈఎన్ఎస్  అందించిన ప్రత్యేక వార్త కథనాలపై ఎట్టకేలకు స్పందించింది.. సుమారు ఐదున్నరేళ్ల పాటు గాల్లో ఉన్న మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ ఖరారు చేయడానికి రూట్ క్లియర్ చేయడానికి రంగం సిద్దం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీరిని ఉద్యోగాల్లో నియమించిన తరువాత.. కోర్టులో కేసులు పడితే వీరికి పోలీసుశాఖకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకి చెప్పేసి కూడా వీరిని పోలీసు, అంగన్వాడీ సేవలకు వినియోగించుకుంది తప్పితే వీరికి ఎలాంటి న్యాయం చేయలేదు.. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వస్తూ వస్తూనే వీరి విషయాన్ని హోం మంత్రి అనిత ద్వారా అసెంబ్లో ప్రస్తావించి భారీ స్థాయిలో హడావిడి చేసి వైఎస్సార్సీ చేసిన తప్పిదాలను కడిగేసింది. ఇపుడు సరిగ్గా ఏడాదిన్నర తరువాత మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖ కేటాయించడానికి ఆప్షన్లు ఇస్తూ ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ కి వర్తమానాలు పంపింది. దీనితో మహిళా పోలీసులకు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.!

హైకోర్టులో కేసుల కారణంగా పోలీసుశాఖకు సంబంధం లేదని గత ప్రభుత్వం చెప్పేయడంతోనే ఇన్నేళ్లూ గాల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నది. సచివాలయ ఉద్యోగుల సమస్యలను 2019 నుంచి ఒక ప్రత్యేక సామాజిక బాధ్యతగా స్వీకరించిన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రభుత్వానికి వీరి సమస్యలు తెలిసే విధంగా అనేక కథనాలు అందించింది. దీనితో ఆలోచనలో పడ్డ ప్రభుత్వం మహిళా ఉద్యోగులు నష్టపోకుండా వారికి ప్రభుత్వశాఖను కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. అసెంబ్లీలో ప్రస్తావించినట్టుగానే.. తలా తోకా లేని మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేయడం ద్వారా వారికి సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించి ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ కు వర్తమానం పంపించింది. 

ఐసిడిఎస్, పోలీసుశాఖలు రెండు ఆప్షన్లు ఇచ్చి వాటిలో వారికి నచ్చిన శాఖను ఎంచుకోమంది. ఉద్యోగులు ఏఏ ప్రభుత్వశాఖలు ఎంచుకున్నారో లెక్కగట్టిన తరువాత వీరికి ప్రభుత్వశాఖ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవడానికి అధీకృతంగా ఉండేవిధంగా హెచ్ఆర్ఎంఎస్ ద్వారనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అయితే ఈ రెండు ప్రభుత్వశాఖల్లో వీరికి ఏ క్యాడర్ ఉద్యోగాలను ప్రభుత్వం అలాట్ చేస్తుందో క్లారిటీ మాత్రం రాలేదు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ముందు తమకు ప్రభుత్వశాఖ ఏర్పాటు చేస్తే ఆ తరువాత జరగాల్సిన తంతు జరుగుతుందని ఉద్యోగులు కాస్త ఊరట చెందుతున్నారు.
మరో వైపు గత ప్రభుత్వం రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంచేయడంతో ఆ వ్యవది పూర్తయిన వారు ఇటు పోలీసుశాఖలోనూ, అటు ఐసిడిఎస్ లో నూ భారీగా రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. 

దానికోసం గతంలోనే ఉద్యోగులకు ప్రమోషన్స్, అడ్జెస్ట్ మెంట్స్, డిప్యూటేషన్స్ ఇలా మూడు అంశాలను ఉటంకిస్తూ జీఓ జారీ చేసింది. సదరు జీఓ ఆధారంగానే ఇపుడు మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ చూజింగ్ ఆప్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా వీరికి ప్రభుత్వశాఖ అంటూ ఒకటి ఏర్పాటు అవుతుంది. ఆ తరువాత ఏ క్యాడర్ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం విధివిధానాలు రూపొందించే అవకాశాలున్నాయని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈరోజు-ఈఎన్ఎస్ కి తెలిపారు. అయితే సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో జూనియర్ అసిస్టెంట్ పేస్కే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖ ఎంచుకున్నవారికి క్లరికల్ క్యాడర్ ఉద్యోగాన్ని అందించి వారిని పోలీసు స్టేషన్లలో మినిస్టీరియల్ సిబ్బందిగా వినియోగించుకునే అవకాశం ఉందని, లేదంటే ఫిజికల్ ఫిట్ నెస్ ఆధారంగా మళ్లీ ప్రత్యేంకగా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్టు ద్వారా ప్రత్యేక పరీక్ష పెట్టి కానిస్టేబుళ్లుగా తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది. 

అయితే ఇప్పటికే చాలా మంది ఉద్యోగులకు పోలీసు ఉద్యోగం వయస్సు దాటిపోయింది. దాని కారణంగా వారికి డ్రెస్ డ్యూటీ ఉంటే పోస్టు వచ్చేఅవకాశం లేదని కూడా సమాచారం అందుతుంది. అయితే గతంలో మహిళా పోలీసులకు ఇచ్చిన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ లెక్కన చూసుకుంటే వీరికి తరువాత ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ ని చేసి ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లకు సిబ్బందిగా పంపిస్తారని కూడా చెబుతున్నారు. అటు ఐసిడిఎస్ ఎంచుకున్నవారికి సూపర్ వైజర్ క్యాడర్ పోస్టు వచ్చే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఐసిడిఎస్ లో తొలి ఉద్యోగం కార్యకర్త అయితే చదువుకున్నవారు విధుల్లో చేస్తున్న ఉద్యోగం సూపర్ వైజర్.. తరువాత పదోన్నతుల ద్వారా సీడీపీఓ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వరకూ పదోన్నతులు దక్కే చాన్సు వుంది. ఏది ఏమైనా ముందు వీరికి డిపార్ట్ మెంట్ ఎలాట్ మెంట్ చేసే క్రమంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనే విషయం తేలనుంది. కాగా ప్రభుత్వం తమ ఉద్యోగాలను గాల్లోనే ఉంచేయకుండా.. ప్రభుత్వం గుర్తించే విధంగా ప్రత్యేక కథనాలు అందించిన ఈరోజు-ఈఎన్ఎస్ కి మహిళా పోలీసులు ప్రత్యేకంగా ఫోన్లు చేసి ధన్యవాదములు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమకు, తమ చదువు, శారీరక దారుడ్యాన్ని అనుసరించి ఒక మంచి పోస్టులో కూర్చోబెడితే జీవితాంతం కూటమి ప్రభుత్వ మేలు మరిచిపోమనే విషయాన్ని కూడా మహిళా పోలీసు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..!