గ్రామ సచివాలయ కార్యదర్శిలకు పదోన్నతిశాపం..!


Ens Balu
9
visakhapatnam
2025-09-06 20:24:19

గ్రామ, వార్డు సచివాలయశాఖలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి కార్యదర్శిలకు పదోన్నతి శాపం వెంటాడుతోంది.. రాష్ట్రప్రభుత్వం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను గ్రేడ్-4 గా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చినా అవి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తప్పా మరెక్కడా సక్రమంగా అమలు అయినట్టు కనిపించలేదు. విశాఖ జిల్లాలో అయితే ఆ ఊసే ఎత్తలేదు డిఎస్సీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్. తమతో పాటు విధుల్లోకి చేరి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు ఇతర జిల్లాల్లో గ్రేడ్-4 పదోన్నతి కల్పించడంతోపాటు చిన్న పంచాయతీలకు కేటాయింపులు చేసి డిప్యూటేషన్లను రద్దు చేశారు. అదేంటో మిగిలిన జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లు ఆ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయకపోవడంతో సచివాలయ పంచాయతీ కార్యదర్శిలు వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గొల్లు మంటున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసే పంచాయతీరాజ్ శాఖ ఇంత దారుణంగా ఉంటే ఇతర ప్రభుత్వశాఖలు ఏ విధంగా ఉంటాయో అర్ధంచేసుకోవచ్చు..!

ఏ ముహూర్తాన గత ప్రభుత్వం అరకొర విధానాలతో గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందో తెలియదు కానీ.. వీరి విషయంలో ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్లు గానీ ఏఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా చేయడం లేదు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శిల కొరత అత్యంత తీవ్రంగా వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో సచివాలయశాఖ ఏర్పాటైన తరువాత చాలా సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శిలను నియమించలేదు. ఉన్న గ్రేడ్-3, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించి అదనపు పనులు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం చొరవతో సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు పదోన్నతులు కల్పించాలని యోచన చేసి ఉత్తర్వులు జారీ చేసినా వాటిని జిల్లా కలెక్టర్లు అమలు చేయలేదు. అమలు చేసిన జిల్లాల్లో మాత్రం  డిప్యూటేషన్లు రద్దు చేసి పదోన్నతులు పొందిన వారికే పంచాయతీలను అప్పగించారు. దానితో వారిని చూస్తున్న ఇతర జిల్లాల  పంచాయతీ కార్యదర్శిలు ఇద్దరం ఒకేసారి విధుల్లోకి చేరినా.. మీజిల్లా కలెక్టర్ వలన మీకు పదోన్నతులు వచ్చాయి.. మా జిల్లా కలెక్టర్ వలన మేము ఇంకా ఇలాగే ఉండిపోయామంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడుతున్నారు. 

వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఒక ప్రభుత్వశాఖకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తే.. వెంటనే అన్ని జిల్లాల్లోని డిఎస్సీ కమిటీ చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు దానిని అమలు చేయాలి. కొత్త జిల్లాలకు చట్టబద్దత లేనందున ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే పదోన్నతులు కల్పించాల్సి వుంది. ఇతర జిల్లాల్లో కలెక్టర్లు చొరవ తీసుకొని పదోన్నతులు కల్పించినా ఉమ్మడి విశాఖజిల్లాలో మాత్ర ఆ ఊసే లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబరు తరువాత ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మరో మూడు నుంచి ఐదు నెలలు సమయం పెరిగిపోతుంది. ఒక్క గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిల విషయంలోనే కాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓ పదోన్నతులు, సర్దుబాట్లు, డిప్యూటేషన్లు సచివాలయ ఉద్యోగులకు చేయాలని జారీ చేసినా దానిపై కూడా జిల్లా కలెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోడం విచిత్రంగా ఉంది. 

అయితే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు వస్తే వారికి వచ్చే ఆదాయం పడిపోతుందని ప్రస్తుతం ఇన్చార్జిలుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిలే జిల్లా కేంద్రాల్లో యూనియన్ల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పదోన్నతులు ముందుకి కదలనీయకుండా చేస్తున్నారనే ప్రచారం ఈ మధ్య కాలంలో తారా స్థాయిలో జరుగుతుంది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా వాటిని అమలు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు నిజమని నమ్ముతున్న పరిస్థితులే అధికంగా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసే సమయంలోనే దానికి విధి విధానాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి ఉంటే ఎలాంటి అడ్డంకులు రావు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం అలాంటి పనులు సక్రమంగా చేయకపోవడం వలనే.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ఏమీ చేయకుండా కాలయాపన చేస్తూ.. నామ్ కేవాస్తు జీఓ విడుదల చేయడానికి అవకాశం ఏర్పడిందని సచివాలయ ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పంచాయతీ  గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు గ్రేడ్-4 కార్యదర్శిలుగా పదోన్నతులు కల్పించడంతోపాటు, చిన్న పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలను నియమించాలని కూడా ఉద్యోగులు, జిల్లా వాసులు కోరుతున్నారు. డిప్యూటేషన్ పై పనిచేసే వారు పంచాయతీకి ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి నెలకొంటుందనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్న జిల్లాల కలెక్టర్లు సచివాలయ ఉద్యోగులు వారి ప్రమోషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!