గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి డిమాండ్లు సాధించుకోవడంలో యూటర్న్ తీసుకున్నారు..అవును ఇది నిజం.. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగాన్ని గాల్లో పెడతారానే సంకేతాలు వచ్చాయట.. అందుకే కొందరు ఉద్యోగులు ఉద్యోగం ఉంటే చాల్లే.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్ లేకపోయినా పర్లేదని వాట్సప్ యూనివర్శిటీలో సన్నాయి నొక్కుళ్లు నొక్కుతున్నారు.. మొన్నటి వరకూ తమకు పదోన్నతులు అర్జెంగ్ ఇచ్చేయాలి.. నోషనల్ ఇంక్రిమెంట్లు కావాలని ఒంటికాలిపై లేచిన సచివాలయ ఉద్యోగులు ఇపుడు వెనక్కి తగ్గిపోవడం చర్చనీయాంశం అవుతున్నది. అయితే అన్ని యూనియన్ల ఉద్యోగులు కాదండోయ్.. ఇక్కడ కొన్ని యూనియన్లు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయట. మిగిలిన వారు తమ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారట..ఆ విషయాన్ని కూడా స్వయాన సచివాలయ ఉద్యోగులే మీడియాకి లీకులివ్వడం కూడా విశేషం..!
తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలదన్నేవాడు ఒకడుంటాడని.. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ప్రతీసారి రుజువవుతూ వస్తున్నది. ఉద్యోగుల్లో ఉద్యోగులకి.. యూనియన్లలో యూనియన్లకి పడక వారు న్యాయ బద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఉద్యోగులు యూటర్న్ తీసుకోవాల్సి వస్తున్నది. ప్రస్తుతం కొందరు సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పని కూటమి ప్రభుత్వానికి తెగ కలిసొచ్చేవిధంగా తయారైంది. డిమాండ్ చేసేవారికంటే.. చేయని వారంటనే ప్రభుత్వానికి ఇష్టం కదా.. వారినే అక్కున చేర్చుకుని.. చేసేవారిని ఓ కంట కనిపెట్టుకొని ఉండటానికి కూడా బాగుంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వశాఖ ఏర్పాటైతే దానికి విధి విధానాలన్నీ ఆ శాఖ ఏర్పాటు అయినపుడే సదరు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఒక గెజిట్ ద్వారా చట్టబద్దత తీసుకు వస్తారు..
అదేంటో ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి తలా తోకా లేకుండా వ్యవహారం మొత్తం నడిచినా.. చట్టపరంగా.. న్యాయబద్దంగా సాధించుకోవాల్సిన డిమాండ్ల విషయంలో ఒకరు ఎడ్డం అంటే మరొకరు తడ్డెం అంటున్నారు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఈ ద్వంధ వైఖరి కలిసొచ్చి ఎవరికీ పదోన్నతులు ఇవ్వకుండా ఐదేళ్లు కాలం గడిపేసింది. ఉద్యోగుల్లో ఉద్యోగులకే పడక ఆడుతున్న నాటకాలు కూడా కూటమి ప్రభుత్వానికి కూడా కలిసొచ్చే విధంగా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేసేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సాక్షిగా హడావిడి చేసిన కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. పైగా.. ఈశాఖను విచ్చిన్నం చేయడానికి క్లష్టర్ వ్యవస్థ, రేషనలైజేషన్, డిప్యూటేషన్ అంటూ జీఓలు తీసుకొచ్చినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఎక్కడా నోరు మెదపలేదు.
తాగాజా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల జేఏసీ అంటూ తెరపైకి వచ్చి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తాం.. సర్వీసులు నిలిపివేస్తాం.. పెన్షన్లు పంచమని చెప్పిన వారే తాము ఆ మాట అనలేదని అంటే.. మరికొందరు ఆ జేఏసితో తమకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపారు. మరికొన్ని యూనియన్ల సభ్యులు ఎవరో ఒకరు చేస్తున్నారు కదా.. మళ్లీ మనమెందుకు అన్నట్టు మిన్నకుండిపోయారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరికొన్ని సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే కలిసొచ్చింది కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంఘాల్లో ఉద్యోగులు.. జేఏసి పేరుతో విధులు బహిష్కరణ, డిమాండ్ల సాధనతో మాకు సంబంధం లేదని వాట్సప్ గ్రూపుల్లో చర్చకు తెరలేపింది. అదీ ఎంతలా అంటే విషయం మొత్తం మీడియాకి తెలిసే విధంగా కొందరు ఉద్యోగులు పనిగట్టుకొని మరీ ఈ విషయాలను లీకులు ఇచ్చేంతగా మారిపోయింది.
అంటే ఒక వర్గం ఉద్యమం చేస్తుంటే.. ఒక వర్గం దానికి సంబంధం లేదన్నట్టుగా వ్యహరించడం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్నది. ప్రభుత్వం చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తుందని.. చేయడం ఇష్టం లేకపోతే హడావిడీ చేసి ఊరుకుంటుందని.. దానికోసం డిమాండ్లు, విధులు బహిష్కరణ అంటే ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తుందని బెదిరింపులకు దిగడం ఇక్కడ విశేషం. ఉద్యోగుల జేఏసి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ కి నోటీసు ఇచ్చిన తరువాత ఈ విషయాలన్నీ తెరపైకి రావడం వెనుక ఉద్యోగ సంఘాల్లోని వారికే క్లారిటీ లేదని.. ఒకరంటే మరొకరికి గిట్టడం లేదని పక్కాగా తేలిపోయింది. ఇలాంటి అంశాలే ప్రభుత్వానికి కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ప్రస్తుతం కూడా అదే జరిగేలా కనిపిస్తున్నది. ఒక వర్గం అలా ఉంటే ఉద్యమం చేయాలనుకున్న వర్గంలోని యూనియన్లు ఉద్యోగులు మాత్రం... ఫ్రీ బస్సుతో ఉపాది పోయిందని రోడ్డెక్కి మరీ పథకాన్ని సాధించుకున్న ఆటోకార్మికులే నయం..
ఆ పాటికూడా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రాలేకపోతున్నామని వాట్సప్ గ్రూపుల్లోనే ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఏ ది ఏమైనా భూమికి బొక్క పెడతాం..ఆకాశాన్ని అరచేత్తో పట్టేస్తామని బీరాలు పోయి..డమ డిమాండ్లు అన్నీ సాధించుకుంటామని ప్రకటన చేసిన ఉద్యోగ సంఘాల్లో వారిలో వారికే పడక బయటకు వస్తున్న తేడా వ్యవహారాలు.. డిమాండ్ల సాధనకు కొన్ని యూనియన్లు వ్యతిరేకమని తేలిపోయింది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు.. పదోన్నతులు, సర్వీసు రూల్స్, జాబ్ క్యాడర్, కోర్టు కేసులో ఉన్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వశాఖ కేటాయింపు వంటి అంశాలు మరో మూడున్నరేళ్ల వరకూ పరిష్కారం అయ్యే మార్గాలు కనుచూపుమేరలో కనపించవనే విషయాన్ని ఇటు విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఎక్కడైనా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉండే పొరపొచ్చాలే ఇటు గ్రామ, వార్డు సచివాలయశాఖ లో కూడా వారి డిమాండ్ల సాధన విషయంలో రాజకీయం చేయడానికి తెరపైకి రావడం విశేషం..!