భారత దేశం మొత్తం తొంగిచూసే విధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వమే పెడచెవిన పెట్టింది. కరోనాలాంటి ప్రాణాంతక వైరస్ సమయంలో సెలవులు సైతం తీసుకోకుండా పనిచేసినందుకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పూర్తియినా..వారి సర్వీసులను రెగ్యులర్ చేయకుండా పక్కన పెట్టింది. ప్రభుత్వానికి గ్రామస్థాయిలో ఎంతో బలాన్నిచేకూర్చిపెడుతుందనుకున్న సచివాలయ వ్యవస్థ, అందులోని ఉద్యోగులే ఒక్కసారిగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వాస్తవానికి ఈ పరిణామాన్ని ప్రభుత్వం కూడా ఊహించి ఉండదు. అయితే ఈ ఆలోచన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వచ్చినది కాదంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వానికి కాస్త తేడాగా ఆలోచనలు రుద్ది కావాలనే సచివాలయ ఉద్యోగుల సహకారాన్ని దూరంచేయడానికే..రెండేళ్లు ప్రొబేషన్ పూర్తయినా..కనీసం సచివాలయ ఉద్యోగులను అసలు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించకుండా ఇతర శాఖల ఉద్యోగులకు వరాలు ఇచ్చి..తమకు రిక్త హస్తం చూపిస్తారా అంటూ ఉద్యోగులంతా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయారు.
వినూత్నంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని మండలాల్లోని అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చేసి..తమకు న్యాయం చేయాలంటూ సచివాలయ ఉద్యోగులంతా తమ తమ వాట్సప్ గ్రూపుల్లో స్టేటస్ లు పెట్టి మరీ నిరసన తెలియజేశారు. సోమవారం నుంచి తమ నిరసన దశలవారీగా పెంచుతామని మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకూ సందేశాలను పంపారు. ఒకేసారి లక్షా 28 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. ఏం చెప్పినా చేస్తారనే కోణంతో రెండేళ్లలో పెట్టాల్సిన డిపార్టమెంటల్ టెస్టులన్నీ రెండేళ్లు పూర్తయిన తరువాత పెట్టడం, కరోనా సమయంలో కనీసం సెలవులు ఇవ్వకపోవడమే కాకుండా, రెండవ శనివారం, ఆదివారాల్లోనూ అజమాయిషీ చేసి మరీ పనిచేయించుకున్న ప్రభుత్వం తమను ఇంత దారుణంగా పక్కన పెడుతుందని తాము కలలో కూడా ఊహించలేదని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు గ్రామస్థాయిలో ప్రజలందరికీ చేర్చడానికి, ఆరోగ్యసేవలు అందించడానికి ప్రాణాలు పణంగా పెట్టినా ప్రభుత్వం గుర్తించకుండా, కేవలం ఇతర ప్రభుత్వశాఖలకు ఇచ్చిన గౌరవం తమకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా జనవరి నెల జీతంతోనే పెంచిన పీఆర్సీ జీతం ఇవ్వడంతోపాటు, రెండేళ్లు సర్వీసు పూర్తయిన తమకు ప్రొబేషన్ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో లేకపోయినా ప్రభుత్వానికి అనుగుణంగా పనులు అదనపు గంటలు, సెలవుల్లో పనిచేయించుకున్న ప్రభుత్వం...ప్రసూతి సెలవులు పెట్టిన మహిళా ఉద్యోగులకు మాత్రం సర్వీసు ప్రొబేషన్ ఆరు నెలలు పొడిగింపు ఇచ్చారని..అన్నీ ప్రభుత్వానికి అనుకూలంగానే చేయించుకుంటూనే తమను పక్కనపెట్టి అవమానించారని ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు మండల స్టాఫ్ వాట్సప్, టెలీగ్రామ్ గ్రూపుల్లో బయటకు వచ్చేయడంతో విషయాన్ని గమనించిన ఎంపీడీఓలు సచివాలయ కార్యదర్శిలతో సచివాలయ ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీచేయించింది. అయినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. అదే సమయంలో కార్యదర్శిలను మచ్చిక చేసుకొని, సచివాలయ ఉద్యోగులకు వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నమూ చేశారు. దీనితో విషయం తెలుసుకున్న ఉద్యోగులు కొన్ని జిల్లాల్లో బహిరంగంగానే తమ నిరసన తెలియజేసి మీడియా ముందుకి వచ్చారు. దీనితో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనను ఆ శాఖ జేసిలే అడ్డుకోలేకపోయారు.
జెసిలు ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు పంచాయతీల్లోని గ్రేడ్ 5 కార్యదర్శిలపై మండిపడ్డారు..కొన్ని చోట్ల కార్యదర్శిలు సచివాలయ ఉద్యోగులకు నచ్చజెప్పాలని చూసినా, భయపెట్టాలని ప్రయత్నించినా ఫలితం మాత్రం దక్కలేదు. పైగా ఆ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా వారి వారి సామాజిక మాద్యమాల్లో షేర్ చేసి మరీ..అందరికీ తెలియజేసుకున్నారు సచివాలయ ఉద్యోగులు. అసలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులంగా మనం ప్రభుత్వాన్ని సరర్వీసు రెగ్యులర్ చేయమని అడగటమేంటని..అన్ని ప్రభుత్వశాఖల్లోనూ ఏవిధమైన నిబంధలు పాటిస్తున్నారో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనూ అవే నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ప్రభుత్వానికి ఒక్క గ్రామవార్డు సచివాలయశాఖలో మాత్రం లేనిపోని నిబంధనలు, అన్నిరకాల పనులు అప్పగించి చేయించిన ప్రభుత్వం ఎందుకు తమను పక్కన పెట్టాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఇప్పటి వరకూ పనిచేసి గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు ఒక్కసారిగా ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల కారణంగా గౌరవం తీసుకొచ్చిన ఉద్యోగులే ఇటు ప్రతిపక్షాల ముందు, అటు ఇతర ప్రభుత్వ శాఖ ముందు ప్రభుత్వానికి గాలి తీసేసే చర్యకు పూనుకున్నాయి...
కాదు కాదు..ఈ విధంగా పూనుకునేలా ప్రభుత్వానికి తమ సొంత నిర్ణయాలు ఆపాదించే లా చేసిన కొంత మంది ద్వారా మాత్రమే జరిగిందనేది ఇపుడు తేటతెల్లమైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ మానస పుత్రికకు ప్రాధాన్యత ఇచ్చిన తరువాత ఇతర ప్రభుత్వశాఖలకు ప్రాధాన్యత ఇచ్చివుంటేపరిస్థితి వేరాలా ఉండేది. కాని దానికి వ్యతిరేకంగా జరగడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం చర్చనీయాంశం అవడంతోపాటు, ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చిపెట్టింది. సలహాలిచ్చేవారికి పరిపాలనపై పట్టులేకపోతే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయనే విషయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాల్సిందేనని వాదన సర్వత్రా వినిపిస్తున్నది.