మా దుస్తితి ఎవరికి చెప్పుకోము.. మీకు తప్పా


Ens Balu
2
Amaravati
2022-04-07 12:44:19

గ్రామ స్థాయిలో మహిళలు, విద్యార్ధినిల సంరక్షనార్ధం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారంటే ఏమో అనుకున్నారు అంతా.. ఏదైనా సమస్య వస్తే ప్రజలంతా మహిళా పోలీసుల ద్వారా పోలీస్ స్టేషన్ కి చెప్పకుంటారు.. అదే గ్రామ సచివాలయ మహిళా పోలీసుకే సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి..ఆ గోడు ఎవరికి వినిపించుకోవాలి.. వీరిని పట్టించుకునే నాధుడేడి.. జీతం ఇచ్చేది సచివాలయం కనుక విధులన్నీ ఇక్కడే చేయాలంటారు పంచాయతీ కార్యదర్శి.. అదేంటి మీది హోం డిపార్ట్ మెంట్ కదా..మీరు స్టేషన్ ఎస్ఐ చెప్పే ఉద్యోగం చేయాలి కదా అంటారు స్టేషన్ ఎస్ఐ.. పోనీ స్టేషన్  విధులు వేసినపుడు ఎస్ఐని ఎంపీడీఓతో మాట్లాడమంటే నాకేం సంబంధం అదంతా మీరే చూసుకోండి అంటారు.. అలా కాదని గ్రామసచివాలయంలో విధులు ఉన్నప్పడు స్టేషన్ డ్యూటీలకు రావడం కుదరదని ఎస్ఐకి కార్యదర్శిగా ఒక్క మాట చెప్పమంటే ఇది మరీ బాగుంది, అయినా మీ కోసం మేమెందుకు మాట్లాడతామంటారు పంచాయతీ కార్యదర్శిలు.. మీరేం చేస్తారో మాకు అనవసరం మేం చెప్పింది చేయాల్సిందే అంటున్నారు. దీనితో ఈ ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర వేదింపులకు గురవుతున్నారు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు. ఇచ్చేది ప్రస్తుతం జీతం రూ.15 వేలే అయినా గ్రామసచివాలయం నుంచి ఆ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ కి 30 సార్లు తిప్పుతిన్నారు స్టేషన్ ఎస్ఐలు.. గ్రామసచివాలయంలో పని చేయకపోయినా.. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ పనులపై వెళ్లినా.. అదేదో దేశ ద్రోహం చేసినట్టు సమావేశాల్లో నిలబట్టి మరీ తిడుతున్నారు పంచాయతీ కార్యదర్శిలు. వాస్తవానికి ఈ రెండు శాఖలకూ జిల్లాశాఖల అధికారులు దిశ నిర్ధేశం చేయాల్సి వుంది. అలా చేయకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రంగా నలిగిపోతున్నారు. అలాగని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చినా వాటిని మండల స్థాయిలో ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శిలు పట్టించుకునే పరిస్థితిలేదు. అదేదో చిత్తుకాగితంలా పక్కన పెట్టేస్తున్నారు. అలాగని డిజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు జిల్లా పోలీసు అధికారులైనా ప్రాపర్ ఛానల్ లో మండల కార్యాలయాలకు పంపుతున్నారా అదీలేదు. దీనితో ఒకేసారి అటు పోలీస్ స్టేషన్, ఇటు గ్రామసచివాలయాల్లో విధులు ఉన్న సమయంలో అటు ఎస్ఐ నుంచి ఇటు పంచాయతీ కార్యదర్శి నుంచి నానా చీవాట్లు పడుతున్నారు గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు. ఇలాంటి వేధింపులతో ఇప్పటికే జిల్లాలో కొంత మంది మహిళా పోలీసులు విధులకు రాజీనామాలు చేసినా, మరికొందరు చేయడానికి కూడా సిద్దపడుతున్నా.. మహిళా పోలీసుల దుస్థితి, ఇబ్బంది, వేధింపులు, చీత్కారాలు జిల్లా అధికారులకు వరకూ చేరడంలేదు.

 పంచాయతీ కార్యదర్శిలు, స్టేషన్ ఎస్ఐలు ఇచ్చిన టార్గెట్ లు పూర్తిచేయకపోయినా.. చెప్పిన సమయానికి రాకపోయినా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. మీ ఉద్యోగాలు ఎలా రెగ్యులర్ అవుతాయో చూస్తామంటూ వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. అసలు ఉద్యోగ నియామకాలు చేసే అధికారంగానీ, విధుల్లోని తొలగించే అధికారం గానీ, ఆఖరికి ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తరువాత  వారి సర్వీసులను రెగ్యులర్ చేసే అధికారం గానీ ఇటు స్టేషన్ పోలీసులకు గానీ, అటు గ్రామసచివాలయ కార్యదర్శిలకు గానీ లేదు. కానీ హద్దులు దాటి మరీ వీరంతా మహిళా పోలీసులకు  తెగ వార్నింగులు ఇచ్చేస్తున్నారు. వారిద్దరి మాటలు, ఇచ్చే వార్నింగ్ లు, చేసే ఓవరేక్షన్ విన్నా, చూసినా.. మహిళా పోలీసుల బాధలు తెలుసుకున్నా..నిజంగా అటు స్టేషన్ ఎస్ఐ, ఇటు పంచాయతీ కార్యదర్శిలే తమకి వచ్చే జీతాలు ఇచ్చేస్తున్నారేమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంటుంది బయటవారికి. ఒక్కోసారి జిల్లా అధికారులే తమతో ఈ విధంగా మాట్లాడిస్తున్నారన్న నెపం కూడా వీరిద్దరూ ప్రదర్శించడం కూడా విస్మయానికి గురిచేస్తుంది. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసుల దుస్థితి నిజంగా చాలా దయనీయంగా వుంది. సచివాలయాల్లో కార్యదర్శిలు చేసే ఓవరేక్షన్ ఇటు జిల్లా పంచాయతీ అధికారులు, స్టేషన్ లలో ఎస్ఐ ఇచ్చే వార్నింగ్, తిట్ల పురాణం అటు జిల్లా ఎస్పీలకు చేరడం లేదు. నిజంగా పరిస్థితి ఆ ఇద్దరు జిల్లాశాఖల అధికారులకు చేరితే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు. ప్రజల సమస్యలను స్పందన రూపంలో సచివాలయాల్లో సమర్పిస్తే  గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించే పోలీసు విభాగానికి చెందిన మహిళాపోలీసులు.. వారి సమస్యలను జిల్లా పోలీస్ స్పందనలో ఫిర్యాదులు చేస్తే తప్పా పరిష్కారం అయ్యేటట్టు కనిపించడం లేదు. 

ఈ పరిస్థితి ఏ ఒక్క జిల్లాలోనో కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాకపోతే గంజాయి వనంలో తులసి మొక్కలా కొన్నిచోట్ల స్టేషన్ ఎస్ఐలు మానవతా ద్రుక్పదంతో సమస్యలను పరిష్కరిస్తుంటే.. ప్రభుత్వ విధులపై అవగాహన ఉన్న పంచాయతీ కార్యదర్శిలు మహిళా పోలీసులు విధులకు ఆటకం కల్పించకుండా, వారిని వేధించకుండా వారు చేసే ఉద్యోగాలకు వన్నె తెస్తున్నారు. మరికొందరు వచ్చిందే సూపర్ డూపర్ చాన్సు అనుకొని మొత్తం అజమాయిషీ చలాయించే పనే పెట్టుకోవడంతో మహిళా పోలీసులు తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలు జీతం సచివాలయం నుంచి పోలీస్ స్టేషన్లకు తిరగడానికే సరిపోయినా.. వారి కుటుంబ పోషణకు అప్పులు చేసుకొని జీవనం సాగిస్తూనే విధులు నిర్వహిస్తున్నా...వీరి బాధలు, వేధనలు, వేధింపులు ఎవరికీ పట్టడం లేదు. మానవతా ద్రుక్పదంతో ఆలోచించే జిల్లా ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులూ మీరైనా స్పందిస్తారా..లేదంటే మీ కింది స్థాయి సిబ్బంది చేసే పనులకే వంత పాడతారా అనేది తేలాల్సి వుంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులను చెప్పుకోలేని మాటలతో వేధించే కొందరు పంచాయతీ కార్యదర్శి(బయటకు చెప్పుకోలేని మాటలు, చేష్టలతో వేధించే) లను, వారి ఆగడాలను మాత్రం ఆధారాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ద్రుష్టికి తీసుకెళతామని మాత్రం మహిళా పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలు ప్రచురించడమే కాకుండా, వారికి దన్నుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని కూడా తెలియజేస్తున్నాం. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలపై గళం విప్పే ఈఎన్ఎస్ ఇకపై కూడా ఉద్యోగుల సమస్యలను, ఇబ్బందులను కూడా బహ్య ప్రపంచానికి, అటు ముఖ్యమంత్రి కార్యాలయం ద్రుష్టికి కూడా ప్రత్యేక వార్తా కధనాల ద్వారా తీసుకెళతామని నిర్భయంగా ప్రకటిస్తున్నాం.