కొత్త జిల్లాలకు అధికారులు కావలెను..!


Ens Balu
2
Amaravati
2022-04-15 02:08:27

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విభజించిన 13 కొత్త జిల్లాల్లోని 75 ప్రభుత్వ శాఖలకు అధికారులు కొరవడ్డారు. ఈ జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమించినంత త్వరగా ప్రభుత్వం జిల్లా శాఖల అధికారులను నియమించలేకపోయింది. దానికి వివిధ శాఖల్లో అధికారుల లేమి స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో ఒక్కోశాఖ అధికారిని రెండు జిల్లాలకు అధికారిగా నియమించింది. కొత్తజిల్లాల్లో పరిపాలన ప్రారంభం అయినా జిల్లాలో పూర్థిస్థాయిలో అధికారులు సిబ్బంది లేకపోవడంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిజిల్లాల్లో అధికారులు నియమింతులైనా..ఇంకా కార్యాలయా సామాగ్రి రాలేదు. వచ్చిన చోట ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. అందులోనూ ప్రభుత్వం కొత్త జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం  కోసం జిల్లా కార్యాలయానికి సైతం సిబ్బందిని కుదించేయడంతో ఒక్కో కార్యాలయానికి కేవలం ఐదు నుంచి ఏడుగురు ఉద్యోగులు మాత్రమే పనిచేసేలా కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇక కలెక్టరేట్లలో అయితే అన్ని విభాగాలను కుదించేసి కేవలం నాలుగు సెక్షన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. అన్ని కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓలు తప్పా మిగిలిన శాఖల ఉద్యోగుల భర్తీ మాత్రం పూర్తిస్థాయిలో జరగలేదు. అరకొరగా ఉన్న సబ్బందితో జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేస్తున్న స్పందనకు సైతం అన్నిశాఖల అధికారులు రాలేకపోతున్నారు. వాస్తవానికి అధికారుల విభజన జిల్లాల విభజన కంటే ముందుగా చేపట్టినా అదిమాత్రం ఒక కొలిక్కి రాలేదు. అందులోనూ పాత జిల్లాల్లో తప్పితే.. కొత్త జిల్లాల్లోని అధికారులంతా డివిజనల్ స్థాయి అధికారులనే కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులుగా నియమించింది ప్రభుత్వం వారినే జిల్లా అధికారులుగా చూపిస్తూ సేవలు అందిస్తున్నది. కానీ వాస్తవానికి వారి కేడర్ లో మాత్రం మార్పు రాలేదు, పదోన్నతి, జీతాలు అసలే పెరగలేదు. కొత్తజిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖలకు అధికారులంతా జిల్లా అధికారులేనని గుర్తించి పరిపాలన సాగిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలు అయ్యాయి. ఆపై కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన మంత్రులు కూడా ప్రస్తుతం జిల్లాల్లోని అధికారుల కూర్పుపైనా ద్రుష్టిసారించాల్సి వస్తుంది. మంత్రులకు తెలిసిన వారు, జిల్లా క్యాడర్ కి తెలిసిన వారు, ఇంకా జిల్లాకి రావడానికి ఆశక్తిచూపేవారి జాబితాలను కొత్త మంత్రివర్గం తమకు కావాల్సిన అధికారులను తమ తమ జిల్లాలకు జిల్లా అధికారులుగా రప్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నది. అందులో ముఖ్యమం ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి, విశాఖజిల్లా, చిత్తూరు, విజయనగరం ప్రాంతాల్లో ఏర్పాటైన కొత్త జిల్లాలకు అధికారులను ఏర్పాటు చేసుకోవడానికి, పూర్తిస్థాయి పరిపాలనా జిల్లా అనిపించుకునేందు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఇతర కిందిస్థాయి కేడర్ నాయకులు కూడా గట్టిగానే శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మొదలు పెట్టిన పనులన్నీ పూర్తిస్థాయిలో జరిగి, అన్ని ప్రభుత్వశాఖలకు జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది రావాలన్నా, ఏర్పాటు కావాలన్నా 6నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపు ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం కూడా పూర్తవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పదవీకాలం పూర్తవడానికి ఏడాది ముందుగానే జిల్లాలను పరిపూర్ణ జిల్లాలుగా చేయాలన్నది ప్రభుత్వ యోచనగా కనిపిస్తుంది. దానికి ఇటీవల ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేస్తుందా..లేదంటే ఉన్నవారినే సర్దుబాటు చేసి పరిపాలను ఇబ్బంది లేకుండా చూస్తుందా..? చూడాలి కొత్త జిల్లాలకు అధికారులు కావలెను అనే పదాలను ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రభుత్వం ఏస్థాయిలో భర్తీచేస్తుందో..!