ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీన్మార్ ను గ్రామ, వార్డు సచివాలయాలకు చేర్చింది. ఏంటి గ్రామ సచివాలయాలకు తీన్మార్ ను చేర్చడం ఏంటి అనుకుంటున్నారా.. అలా అయితే మీరు బయోట్రిక్ కధ, కొందరు సచివాలయ కార్యదర్శిల అతి, మరికొందరు స్టేషన్ ఎస్ఐలు పదే పదే పనులు చెప్పే తనం, ఆ పై ఏం చెప్పినా, చేసినా, తమ అనుమతి లేకుండా ఏమీ చేయకూడదన్న కొందరు తేడా ఎంపీడీఓల మొండిపట్టు, సచివాలయాల్లో ప్రతీరోజూ జరగని స్పందన ను ఖచ్చితంగా నిర్వహణ చేసేలా నీళ్లు చల్లిన ప్రభుత్వ ఆదేశం తీన్ మార్ బయో మెట్రిక్ కోసం తెలుసుకోవాలి. అవునండి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తన జేబుల్లోనుంచి జీతాలు ఇస్తున్నట్టుగా ఫీలైపోయే అధికారులకు చాలా చక్కగా ప్రభుత్వం గుణపాఠం చెప్పింది. సచివాలయాల్లో పనిచేసే సుమారు 11 నుంచి 14 ప్రభుత్వ శాఖల సిబ్బంది వారి జిల్లాశాఖల అధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని పనులపై సిబ్బంది వారి వారి మాత్రుశాఖల అధికారులు చెప్పే పనులు చేసే ఆదేశాలను పాటించి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో సచివాలయ కార్యదర్శిలు సచివాలయ సిబ్బందిపై ఒంటికాలిపై లేస్తున్నారు. చేసే ఉద్యోగం ఇక్కడే అయినా.. అస్తమానూ వారి జిల్లాశాఖల అధికారుల పనులపై బయటకు వెళ్లిపోతున్నారని, కార్యాలయ పనులు చేయడం లేదని, ఇలా అయితే సర్వీసు రెగ్యులైజేషన్ నిలిపేస్తామని, సాలరీలు పెట్టేది లేదని బెదిరింపులకు దిగుతూ, తెగఫీలైపోయి, వారి జేబుల్లోనే జీతాలు ఇచ్చేస్తున్నట్టుగా.. ఆఖరికి సిబ్బంది విధులు చేపట్టడం లేదన్నట్టుగా తేల్చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయాశాఖల ఉద్యోగులు చేయాల్సిన పనులపై ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు, సర్క్యులర్ ల ద్వారా సమాచారం పంపినప్పటికీ వాటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు సచివాలయాల్లో. అందులోనూ వచ్చే సర్క్యులర్ లు కూడా అటు జిల్లాశాఖల ప్రభుత్వ అధికారులు ప్రాపర్ ఛానల్ లో పంపించడం లేదు( రాష్ట్రశాఖ నుంచి జిల్లాశాఖకు, జిల్లాశాఖ నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి గ్రామ, వార్డు సచివాలయానికి) దీనితో ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం చెబుతున్నది అనే విషయం సచివాలయాల్లోని కార్యదర్శి, స్టేషన్ ఎస్ఐ, పీహెచ్సీ వైద్యాధికారి, మండల ఇంజనీరు, వ్యవసాయాధికారి, ఉద్యానవన అధికారి, మండల సంక్షేమ అధికారి, మండల రెవిన్యూ అధికారులకు తెలియడం లేదు. ఈ క్రమంలో ఇటు సచివాలయాల్లోనూ, అటు మాత్రుశాఖల్లో చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఈ సమయంలో మాత్రుశాఖ అధికారులు, ఇటు సచివాలయ కార్యదర్శిలు చెప్పే పనులు చేస్తుంటే..ఎక్కడలేని మంట, ఇబ్బంది, చిరాకు, ఇతరత్రావన్నీ ఇరు పక్షాల అధికారులకూ వచ్చేస్తున్నాయి. అలాగని ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులను అనుసరించి నడుస్తున్నారా అంటే అదీలేదు. ఫలితంగా అధికారులు, సచివాలయ కార్యదర్శిల మధ్య తీవ్రమైన సమాచారలోపం తలెత్తుతుంది. వీరి మధ్యలో సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా నలిగిపోతున్నారు.
ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకెళ్లింది. ఇటు సచివాలయ కార్యదర్శిలు చెప్పే పనులు, అటు మాత్రు శాఖల అధికారులు పురమాయించే విధులకు సచివాలయ సిబ్బంది మొత్తం వెళ్లిపోవడంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించ తలపెట్టిన స్పందన మరుగున పడిపోయింది. దీనిపై లోతుగా అధ్యయనం చేసిన ప్రభుత్వం ఇపుడు మూడు సార్లు బయో మెట్రిక్ సచివాలయ ఉద్యోగులు వేయాలనే నిబంధన పెట్టింది. మధ్యలో వేసే బయో మెట్రిక్ హాజరు ప్రత్యేకంగా మధ్యాహ్నాం 3గంటలకే పెట్టింది. దానికి కారణం ఏంటంటే సచివాలయాల్లో ప్రతీరోజూ 3 నుంచి 5 గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 30శాతం గ్రామ వార్డు సచివాలయాలు, పంచాయతీల్లో ఈ స్పందన నిర్వహించడంలేదు. ఫలితంగా ప్రజలంతా తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ విధంగా రెండో బయో మెట్రిక్ మూడు గంటలకు వేయాలంటే సచివాలయ సిబ్బంది మొత్తం కార్యదర్శితో సహా సచివాలయాల్లో ఉండాలి. అలా ఉంటే స్పందన కార్యక్రమం నిర్వహణకు వీలుపడుతుంది. సరిగ్గా ఆ ఉత్తర్వులను అమలు చేసింది ప్రభుత్వం. స్పందన నిర్వహణకో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు సచివాలయ కార్యదర్శిలు, అటు మండల శాఖల అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టుగా చేసింది.
ప్రస్తుతం చచ్చినట్టు సచివాలయ ఉద్యోగులంతా మధ్యాహ్నాం 3 గంటల వరకూ ఇతర కార్యక్రమాలన్నీ చూసుకొని, మధ్యాహ్నాం 3 నుంచి 5 వరకూ మాత్రం సచివాలయాల్లోనే ఉంటున్నారు. ఎన్ని ఉత్తర్వులు ప్రభుత్వశాఖల ద్వారా ఇచ్చినా వాటిని పెడచెవిన పెట్టే సచివాలయ కార్యదర్శిలు, మండలశాఖల అధికారులను మొత్తం ఏక కాలంలో పనిచేసే విధంగా తీసుకొచ్చిన ఈ తీన్మార్ బయో మెట్రిక్ వలన స్పందన కార్యక్రమం మళ్లీ పూర్తిస్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ సచివాలయాల్లో పనిచేయడం లేదని కార్యదర్శిలు, అలాగని మండలశాఖల అధికారులు చెప్పిన పనులు చేయలేదని వారు ఇద్దరూ మండలాధికారులు తెగ ఫీలైపోయేవారు. ప్రభుత్వం తీసుకున్న తీన్మార్ బయో మెట్రిక్ తో సచివాలయ కార్యదర్శిలతో పాటు, మండల అధికారుల అహంపైనా దెబ్బ కొట్టినట్టు అయ్యింది. ఇపుడు మాత్రుశాఖల పనులు చేయాలంటే ఖచ్చితంగా సచివాలయం నుంచి కార్యదర్శి, లేదంటే సదరు మాత్రుశాఖ అధికారి మాట్లాడుకోవాల్సి వుంటుంది. గతంలో ఈ విధంగా మాట్లాడి తమకు విధులు అప్పగించాలని సచివాలయ ఉద్యోగులు నెత్తీనోరూ కొట్టుకొని చెప్పినా వీరిరువురూ పట్టించుకునేవారు కాదు. శంఖంలో పోస్తేనే తీర్ధం అయినట్టు.. ప్రభుత్వం తీన్మార్ బయో మెట్రిక్ ను అమలు చేస్తే తప్పా వీరి అతికి అడ్డుకట్టపడలేదు. దీని ప్రభావం రోజువారి నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ స్పందనపై పడుతుందా..లేదంటే యదా ప్రకారంగా ప్రభుత్వ ఉత్తర్వులను అటు మండలశాఖల అధికారులు, ఇటు సచివాలయ కార్యదర్శిలు ఏమీ పట్టనట్టు వదిలేస్తారా అనేది తేలాల్సి వుంది.