తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ చేసేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిచాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను శనివారం ఈవో, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల విధానం పునరుద్ధరించాలని టీటీడీ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కౌంటర్ల వద్ద భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగ్గా చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి ఇంజినిరింగ్ అధికారులు ఈవో, అదనపు ఈవోలకు వివరించారు. అన్నప్రసాదాలు అందించేందుకు, అవసరమైన చోట్ల షెల్టర్‌ల ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో మార్పులు తదితర అంశాలపై చర్చించారు. ముందుగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దగల కౌంటర్లను పరిశీలించారు. ఆ తరువాత శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, గోవిందరాజస్వామి సత్రాల వద్దగల కౌంటర్లను ఈవో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవో వెంట జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్ఇ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, అదనపు సివిఎస్‌వో శివకుమార్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, విజిఓ మనోహర్, డిఎస్‌పి మురళీకృష్ణ ఇతర ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.