తిరుపతికి చేరిన సేంద్రియ శనగలు
Ens Balu
1
Tirupati
2022-04-23 12:22:17
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయంతో పండించిన వంద టన్నుల శనగలు టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి సమక్షంలో అధికారులు అందుకున్నారు. తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శనివారం అదపు ఈవో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ, గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో గోవిందుడికి నైవేద్యం సమర్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది అక్టోబరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌లతో టీటీడీ ఒప్పందం చేసుకుందని చెప్పారు. దాదాపు 2500 మంది రైతులు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా, ప్రకృతి వ్యయసాయంతో పండించిన శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా సేకరించి, మార్క్‌ఫెడ్ ద్వారా, తమ మిల్లర్లలో టిటిడి అవసరాలకు తగిన విధంగా రూపొందించి ఇస్తోందన్నారు. ప్రతి ఏడాది లడ్డూ ప్రసాదాల తయారీకి 7 వేల టన్నుల శనగలు, 896 టన్నుల రెడ్ గ్రామ్ దాల్, 215 టన్నుల బ్లాక్ గ్రామ్ దాల్, 474 టన్నుల బెల్లం, 54 టన్నుల ధనియాలు, 25 టన్నుల పసుపు, 237 టన్నుల సోనామసూరి బియ్యం, 22 టన్నుల జీలకర్ర, 83 టన్నుల ఎండు మిర్చి, 284 టన్నుల పెసరపప్పు, 25 టన్నుల శనగకాయలు సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల నుండి ఒకటి, రెండు సంత్సరాల్లో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గో ఆధారిత వ్యవసాయంతో పండించిన 2300 టన్నుల శనగలు అందుతాయన్నారు. ఇప్పటివరకు 1800 ఎద్దులు, వట్టిపోయిన ఆవులను రైతులకు అందించామని, శ్రీవారి ప్రసాదంగా భావించి వారు పూజలు చేసి పోషించుకుంటున్నారని వివరించారు. అంతకుముందు అదనపు ఈవో మార్కెటింగ్ గోడౌన్‌లో స్వామి, అమ్మవారి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నటేష్‌బాబు, మేనేజర్ సుబ్రమణ్యం, మార్క్‌ఫెడ్ మేనేజర్ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.