ప్రజల ఇంటి ముంగిట సమస్యలను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 అక్టోబరు 2న ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలను నాటి నుంచి నేటి వరకూ స్పందన కార్యక్రం వెక్కిరిస్తూనే ఉంది. వినడానికి కాస్త బాధగానూ, వింతగానూ ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడే గ్రామస్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పంది. ప్రభుత్వం ఏర్పాటై సుమారు మూడేళ్లు దాటున్నా నేటికీ సచివాలయాల్లో స్పందన ఊసేలేదు. నేటికీ స్పందన కార్యక్రమం అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది జిల్లా కలెక్టర్, జిల్లా కార్యాలయాలు మాత్రమే. సచివాలయాల్లో సిబ్బంది మొత్తం మధ్యాహ్నాం 3 నుంచి 5 గంటలవ రకూ అందుబాటులో ఉంచే విధంగా తీన్ మార్ బయోమెట్రిక్ అమలు చేస్తున్నా.. సచివాలయాల్లో మాత్రం స్పందన కార్యక్రమం జరగడం లేదు. అదేమంటే ప్రభుత్వం పెట్టిన ప్రతీదీ అమలు చేయాల అంటున్నారు ఇటు జిల్లా అధికారులు, మరో పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేస్తూ కష్టపడిపోయే పంచాయతీ కార్యదర్శిలు. ఎవరైనా మండల అధికారులు, జిల్లా అధికారులు పర్యటనలకు వచ్చే సమయంలో మాత్రం సచివాలయాల ముందు సబ్బరంగా బ్లీచింగ్ చల్లించి, ఆరోజు ఒకరిద్దరిచేత స్పందన దరఖాస్తులు స్వీకరించి దుఖాణం కట్టేస్తున్నారు. ఇదే వరస కొనసాగుతూ వస్తోంది. ప్రతీ ఒక్కరూ తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికే వెళ్లేటట్టు అయితే గ్రామ పంచాయతీ, వార్డుల పరిధిలో సచివాలయాలు ఎందుకనే మాట ప్రతీనోట దారుణంగా వినిపిస్తుంది. అసలు నేటికీ సచివాలయల్లో ఎంత మంది సిబ్బంది, ఏఏ సేవలు అందుతాయో రాష్ట్రంలో 20శాతం మంది ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో అవగాహనలేదంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండే సమయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఇతర శాఖల అధికారులకు భారం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇపుడు 13 జిల్లాలు కాస్తా, 26 జిల్లాలుగా మారి అధికారుల సంఖ్య పెరిగినా కూడా జిల్లా అధికారులు కాదు గదా, జిల్లా కలెక్టర్లు సైతం గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకూ ప్రతీ రోజూ స్పందన కార్యక్రమం నిర్వహించే చర్యలు తీసుకోలేకపోతున్నారు. మొదట్లో అంటే సచివాలయాలు ఏర్పాటైన ఆరు నెలలకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ ఈఎన్ఎస్ లైవ్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా సచివాలయాల్లో స్పందన ఎక్కడ అనే విషయాన్ని రాస్తే.. గ్రామ, వార్డు సచివాలయాలు ఇప్పుడే పుట్టిన పురిటి బిడ్డలు, అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం పెట్టేస్తారా అని ఒంటి కాలిపై లేచారు రాష్ట్ర అధికారుల నుంచి జిల్లా అధికారులు, కలెక్టర్లు, ఆఖరికి సచివాలయ సిబ్బంది వరకూ. రేపు అంటే 2022 అక్టోబరు 2 వస్తే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతాయి. అంటే ప్రభుత్వంలో ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవస్థను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నప్పటికీ కూడా జిల్లా అధికారులుగానీ, జిల్లా కలెక్టర్లు గానీ ఆ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే దానిని ఏమనాలో ప్రభుత్వం చెప్పాల్సి వుంది. ఒకప్పుడు గ్రామ పంచాయతీలో కార్యదర్శి, గుమాస్తా పారిశుధ్యసిబ్బంది మాత్రమే ఉండేవారు. తరువాత కాలంలో వీఆర్వోలు అందుబాటులోకి వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏకంగా సచివాలయాల్లో 11 నుంచి 16 ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులోకి వచ్చినా నేటికీ సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన కార్యక్రమాన్ని అమలు చేయలేకపోతున్నారంటే లోపం ఎక్కడుందోప్రభుత్వంలోని పెద్దలు, రాష్ట్రస్థాయి, జిల్లా అధికారులకే తెలియాలి.. ఇదేదో గ్రామ, వార్డు సచివాలయాలపై అక్కసుతో మేము అంటున్న మాటలు కాదు. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే మాటలు సందర్భంలోనే అనేక ప్రస్తుత అంశాలను గుర్తుచేస్తున్నాం. మేము అనడం కాదు.. స్పందన కార్యక్రమాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జరగడం లేదు అనడానికి సాక్ష్యాలుగా జిల్లా నలుమూలల నుంచి ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లలో అందుతున్న అర్జీలే వాటికి నిదర్శనం. నిజంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించి గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే.. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేవలం పెద్ద పెద్ద సమస్యలు మాత్రమే అర్జీలుగా నమోదు అయ్యేవి. కానీ గ్రామస్థాయి సమస్యలకు కూడా ప్రజలు నేటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకే వెళుతున్నారంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏ స్థాయిలో సేవలు అంతున్నాయి. ఏ స్షాయిలో స్పందన నిర్వహిస్తున్నారో జిల్లా అధికారులే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం ప్రభుత్వం రోజుకి మూడు సార్లు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ వేయాలని నిబంధన పెట్టినపుడే స్పందన కార్యక్రమం ఇక్కడ అమలు జరగడం లేదంటే లోపాన్ని జిల్లా పంచాయతీ అధికారితోపాటు ఇతర జిల్లా శాఖలు, కలెక్టర్, జిల్లా ఎస్పీలు గుర్తించాల్సి వుంది. పాత పెద్దజిల్లాల సమయంలో ఎలాగూ సచివాలయాలను ప్రభుత్వం గానీ, జిల్లా యంత్రాంగం గానీ చక్కదిద్దలేకపోయింది. ఇపుడు జిల్లాలు రెండింతలై.. అధికారులు కూడా అదే స్థాయిలో రెండింతలు పెరిగారు. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన నిర్వహించి, కామన్ సర్వీస్ సెంటర్ సేవలన్నీ అందుబాటులోకి తీసుకోవాలని ఆశిద్దాం.. అంతేకాదు ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. అప్పటీకీ స్పందన కార్యక్రమం జరగలేదంటే మాత్రం అటు ప్రభుత్వానికి, ప్రభుత్వంలోని అధికారులకు..ముఖ్యంగా జిల్లా అధికారులకు ఒక ప్రత్యేక నమస్కారం పెడదాం..!