జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యకలాపాలు భేష్
Ens Balu
1
Vizianagaram
2022-04-26 12:38:46
నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యకలాపా లు సంతృప్తికరంగా ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు అమలు చేస్తున్న విధనాలు, పథకాలు అభివృద్ధి అంతరాలను తొలగించేందుకు ఉపకరిస్తాయని అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం అనంతరం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు చేసిన పర్యటనలో ఆయన గమనించిన అంశాలను వివరించారు. ప్రధాన మంత్రి దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారని, దానిలో భాగంగా ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటించానని, త్వరలోనే జిల్లాలో అభివృద్ధి చెందిన జిల్లాల సరసన చేరుతుందని మంత్రి ఆకాంక్షించారు. జిల్లాకు మళ్లీ వస్తానని అప్పటికి జిల్లాలో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో చేపడుతున్న పనుల్లో కొన్నింటిని మరింత ప్రణాళికాయుతంగా నిర్వహించవలసి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇతర పథకాల ద్వారా జిల్లాలోని ప్రజలు సంతృప్తికర జీవనం సాగించేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, జీవనోపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకటి, రెండు సంవత్సరాల్లో ఆశాజనక జిల్లాల జాబితా నుంచి బయట పడి అభివృద్ధి చెందిన జిల్లాల జాబితాలో విజయనగరం చేరుతుందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పనులు భవిష్యత్తు అభివృద్ధికి సూచికగా నిలుస్తాయన్నారు. గ్రామ సచివాలయాలు, పేదలందరికీ గృహాలు, వెల్ నెస్ సెంటర్ సేవలు, ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరు సంతృప్తికరంగానే ఉన్నాయని, అభివృద్ధి పనులు కూడా బాగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు.