ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన సమాచార పౌర సంబంధాలశాఖ(డీపీఆర్వోలు)కు ప్రాణ సంకటంలా మారింది. మూలిగే నక్కపై తాడిపండు పడిట్టుగా అసలే తీవ్రమైన సిబ్బంది, అధికారుల లేమితో కొట్టిమిట్టాడుతున్న సమాచార శాకకు కొత్తజిల్లాల్లో ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సమాచారశాఖకు రక్త కన్నీరే. అవునండీ జిల్లాల విభజన తరువాత సమాచారశాఖకు ప్రభు త్వం పూర్తిస్థాయిలో కార్యాలయాలు కూడా కేటాయించలేదు సరికదా.. సరిపాడా సిబ్బందిని కూడా నియమించలేదు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మీడియాకి తెలియజేయా లంటే కావాల్సిన కంప్యూటర్లుగానీ, ఇంటర్నెట్ గానీ లేవు. కొత్త జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు ఒక్క డీపీఆర్వోనే చూసుకోవాలి. కనీసం సహాయం చేయడానికి, ఒకేసారి ప్రభుత్వ కార్యక్రమా లు అధికంగా జరిగితే మొత్తం కవర్ చేయడానికి ఔట్ సోర్సింగ్ ఏపీఆర్వోలను సైతం ప్రభుత్వం నియమించలేదు. ఆఖరికి కార్యక్రమాలు కవర్ చేసే టపుడు వెళ్లడానికి వాహన సదుపాయం అసలే లేదు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారిని మీడియాకి ప్రెస్ నోట్ అందించే పనిచేయడం కూడా చేత కావడంలేదు. మరికొన్నిచోట్ల డీపీఆర్వోలు అసలు ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు తయారు చేసి ఇచ్చే సామర్ధ్యం కూడా లేకపోవడంతో అధికారికంగా వచ్చే మెసేజ్ లను ప్రెస్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసి చేతులు దులుపుకుంటు న్నారు. ఇంకొన్ని కొత్త జిల్లాల్లో తమకి చేతకాని పని మీడియాకి తెలియకుండా ఉండేందుకు ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో ప్రధాన మీడియా సంస్థలనుగానీ, జర్నలిస్టులను గానీ చేర్చుకోవడం లేదు. అదేమంటే అలా మీడియా గ్రూపుల్లో జర్నలిస్టులను చేర్చుకోవాలంటే రాష్ట్ర అధికారుల అనుమతి ఉండాలని కొత్త కధలు చెబుతున్నారు. వాస్తవానికి సమాచారశాఖలో డీపీఆర్వోతోపాటు ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టైపిస్టు, ఒక ఏపీఆర్వో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి వుంది. కొన్ని చోట్ల వీడియోగ్రాఫర్లు వున్నా ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలను మీడియాకి పంపించడానికి ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లూ లేవు. కొన్ని చోట్లు వీడియో గ్రాఫర్లు ఉన్నా కెమెరాలు లేవు. దానితో వారి మొబైల్ ఫోన్లలోనే కార్యక్రమాల వీడియోలు కవర్ చేయాల్సి వస్తుంది. డీపీఆర్వోలు వారి సెల్ ఫోన్లతోనే అధికారిక కార్యక్రమాలు ఫోటోలు తీయాల్సి వస్తుంది. ఏజెన్సీల జిల్లాల్లో అయితే డీపీఆర్వోల పరిస్థితి రక్త కన్నీరే. కనీస సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు డీపీఆర్వోలు ముందుగానే జిల్లా కేంద్రంలోని ప్రధాన మీడియా ప్రతినిధుల ఫోన్ నెంబర్లతో డీపీఆర్వో ప్రెస్ వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో ప్రభుత్వ అధికారులకు చెందిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు తప్పితే ప్రెస్ నోట్లు అందించలేకపోతున్నారు. కొందరు డీపీఆర్వోలకి ప్రెస్ నోట్లు కూడా రాయడం రాక అయితే, మరికొందరికి రాయడం వచ్చినా కనీస సదుపాయాలు లేకపోవడంతో సమాచారం మీడియాకి అందించలేకపోతున్నారు. ఆదరాబాదరాగా ప్రభుత్వం కొత్త జిల్లాలకు డీపీఆర్వోలను సమాచారశాఖలో నియమించగలిగింది కానీ, వారి ద్వారా మీడియాకి కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన సమాచారం అందించే ఏర్పాటు చేయలేకపోతుంది.. కొత్తజిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇవ్వాల్సి వున్నా.. అవకాశం లేక, సిబ్బంది కొరతతో కేవలం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమాచారం మాత్రమే అందిస్తున్నారు డీపీఆర్వోలు. అటు కొత్త జిల్లాలకు వెళ్లడం చాలా మంది సమాచారశాఖ అధికారులకు, సిబ్బందికి ఇష్టం లేకపోవడంతో విధుల్లోకి చేరినా ఆడుతూ, పాడుతూ పనిచేస్తున్నారు తప్పితే డీపీఆర్వోలకు మాత్రం కార్యాలయ సిబ్బంది నుంచి కనీస సహకారం అందడం లేదు. మరికొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాలకు బదిలీలు చేయడంతో ఆరోగ్యకారణాలతో లాంగ్ లీవ్ పెట్టేసి ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి తరుణంలో సమాచార పౌర సంబందాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా కమిషనర్ రంగంలోకి దిగి కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలకు కార్యాలయాలు, సహాయానికి ఏపీఆర్వోలను నియమించకపోతే ముందు ముందు పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో..!