ఎన్ని‘కుల’ సంఘాలు ప్రభావితం చేస్తాయా
Ens Balu
2
Tadepalli
2022-04-29 03:07:08
2024 ఎన్నికలను కుల సంఘాలు, సామాజిక వర్గాలు ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. రాజ్యాధికారం అంటే రెడ్లు, కమ్మవర్గానికే చెందిన వాళ్లే ఏళ్లకు ఏళ్లు పరిపాలించాలా, రాజ్యాధికారం అనుభవించాలా అనే ప్రశ్న నేడు బలంగా ఉద్బవిస్తోంది. ఏటెళ్లకాలం ఆ రెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారం చేస్తే..అత్యధిక సంఖ్యలో వున్న బీసీ సామాజిక వర్గాలు ఏమైపోవాలి. రాష్ట్రంలో అదిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత వర్గం, అంభేత్కర్ ముద్దుబిడ్డలైన ఎస్సీ, ఎస్టీలు ఏమైపోవాలి.. సరిగ్గా ఇపుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సామాజిక వర్గం బలాన్ని బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు కట్టబెట్టి అక్కడితో సరిపెట్టాలని..వారిని అక్కడే ఉంచాలని చూసే రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనే వాదనను యువ నాయకత్వం ఇపుడు తెరపైకి తీసుకు వస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్నాళ్లు ఒకరు పెట్టింది తినాలనే భావన ఇపుడు ప్రతీ సామాజిక వర్గంలోనూ మొదలైంది. చిన్నా చితకా పదవులతో సరిపెట్టుకుంటే వెనుక బడిన సామాజిక వర్గాలు రాజ్యాధికారం చేపట్టేది ఎప్పుడు అనే ఆందోళన, బాధ, ఆలోచన ప్రతీ ఒక్క సామాజిక వర్గంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నందున ఇప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలను బలోపేతం చేసుకోవాలని అన్ని సామాజిక వర్గాలూ సమాలోచన చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒకతరం పెద్దలవలన అధికారానికి దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో ఇపుడు యువత తెరపైకి వస్తున్నారు. సామాజిక వర్గం బలాన్ని బట్టి.. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగితే వెనుక బడిన సామాజిక వర్గాల బలం కూడా రాజకీయ పార్టీలకు తెలుస్తుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత ఆయా రాజకీయపార్టీలు ముష్టివేసే నామినేనెడ్ పోస్టులతో సరిపెట్టుకోకుండా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారట. దానికి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు ఆయా ప్రధాన సామాజిక వర్గాలను, ఓటు బ్యాంకును పట్టించుకోకపోవడమనే ప్రధానకారణాన్ని ఇపుడు అన్ని సామాజిక వర్గాలు అంచనాలు వేస్తున్నాయని తెలుస్తుంది. ఇలా అయితే పాత తరంతోపాటు, వచ్చే యువతరం కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే కుల రాజకీయాలు చేయడం ఒక్కటే మార్గమని తలచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాల సంఘాల్లోనూ చర్చలు మొదలై సామూహిక సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది. గత ఎన్నికల సరళిని ద్రుష్టిలో పెట్టుకొని సామాజిక వర్గాల బలా బాలలను ప్రదర్శించడానికి 2024 ఎన్నికలే వేదిక కావాలని కూడా ప్రధాన సామాజిక వర్గాలు బేరీజు వేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత సామాజిక వర్గం కూడా ఈ సారి తమ బలాన్ని అన్ని రాజకీయ పార్టీల వద్ద చాలా బలంగా ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విభజించూ పాలించు అన్నట్టుగా రాజకీయాలు సాగాయాని, అందుకే ఈ దఫా ఎన్నికల్లో తమ సామాజిక వర్గం బలం తెలిసేలా అందరినీ ఏక తాటిపైకి తీసుకురావడానికి చేనేత సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషిస్తోంది. దానికోసం ఇదే సామాజిక వర్గంలోని ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, సాధారణ సంఘాలు, యువ సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా అన్ని రకాల సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బల ప్రదర్శన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అపుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి అడుగు పెట్టిన వేళ ప్రస్తుతం కుల సంఘాలు ఈ ఎన్నికల్లో గట్టిగా ప్రభావితం చేస్తాయనే వాదన బలంగా వినిపిస్తుంది. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు ఎక్కువగా వున్న సామాజిక వర్గాలను లోబరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల రాజకీయ ముఖచిత్రం డిసెంబరు మాసం నుంచి ఏ విధమైన మలుపు తిరుగుతుందనేదే ఇపుడు ప్రతీనోట వినిపిస్తున్న మాట. చూడాలి ఈసారి ఎన్నికల్లోనైనా రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద సామాజిక వర్గమైన చేనేత సామాజిక వర్గానికి ఏ తరహా ప్రాధాన్యత దక్కుతుందో..!