వెంగమాంబ ధ్యాన మందిరానికి శంఖుస్థాపన
Ens Balu
2
Tirumala
2022-04-29 08:03:19
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమం దిరానికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. తిరుమలలో చాలాకాలం పాటు ఆమె ధ్యానం చేశారని, ధ్యానం చేస్తూనే శ్రీవారిలో ఐక్యమయ్యారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు శ్రీ ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి చైర్మన్ కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, ఇఇ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.