ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇపుడు అనకాపల్లి జిల్లావైపే తొంగి చూస్తోంది. అవును..రాష్ట్ర రాజకీ యాల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తూ, ఎంతో ప్రాముఖ్యత వున్న పంచాయతీరాజ్ మరియు గ్రామీనాభివ్రుద్ధి మంత్రిత్వ శాఖను కట్టబెట్టిన ప్రజామోదం పొందిన ప్రభుత్వంగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రాధాన్యత సంత రించుకుంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే జీవితంలో ప్రభుత్వ విప్, మంత్రి పదవి రావడం అరుదుగా వుంటుంది. అలాంటిది ఒకసారి ప్రభుత్వ విప్ తోపాటు, ఏకంగా డిప్యూటీ సీఎం పదవి పొందిన వ్యక్తిగా బూడి ముత్యాలనాయుడు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. గ్రామం నుంచి రాష్ట్రాభివ్రుద్ధిలో ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిగా, ప్రజలు మెచ్చిన నేతగా కూడా ఎదిగారు. అందులోనూ జిల్లాల విభజనలో ఒకే జిల్లాకి ఒక డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవి వస్తే ఆ జిల్లాపై రాష్ట్రం ద్రుష్టి ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వశాఖల్లో ఎంతో ప్రాధాన్యత వున్న శాఖకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అనకాపల్లి జిల్లాను ఏ స్థాయిలో ముందుకి తీసుకెళ్లబోతున్నారనే ఆలోచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. పరిపాలనలోనూ, అభివ్రుద్ధి విషయంలో చాలా పట్టువున్న ‘బూడి’ కొత్తగా మారిన అనకాపల్లి జిల్లాపై తనదైన శైలిలో ముద్రవేస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజలు రెండున్నరేళ్లుగా చాలా దగ్గరగా చూస్తున్నారు. తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువైన సచివాలయ వ్యవస్థను మరింతగా ప్రజల ముందుకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇపుడు బూడి అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉపాది హామీ పథకంలోని పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1900 కోట్ల చెల్లింపులు చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇపుడు అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నాయి. వచ్చీరావడంతోనే పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పిస్తే..రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధిలో ఇంకెలాంటి మార్పులు తీసుకు వస్తారనే ఆలోచన అందరిలోనూ పుట్టేలా చేసి ప్రజల ద్రుష్టిని మరల్చగలిగారు.
భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఒక లక్షా 30వేల ఉద్యోగాలతో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత అభివ్రుద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా ఈ శాఖను అభివ్రుద్ధి చేయాలన్నది ‘బూడి’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనుగుణంగానే చేసిన నిర్మాణాలు, కట్టడాలకు ఇబ్బందులు రాకుండా గ్రామీణ ఉపాది హామీ పనుల బిల్లులు క్లియర్ చేయడానికి రంగం సిద్ధం చేయడం కూడా దానికి మరింత ఊతమిచ్చింది. వీటితోపాటు, ప్రస్తుతం కొత్త జిల్లాలో సుమారు 75 ప్రభుత్వశాఖలకు మంచి అధికారులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనే మరో లక్ష్యాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా సచివాలయ శాఖలో మిగులు ఖాళీల భర్తీ, ఎన్ఎంఆర్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, పదోన్నతులు, బదిలీలు.. ఇలా చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉండిపోయాయి. వాటితోపాటు కొత్త జిల్లాలో అన్ని శాఖలకు జిల్లా అధికారుల నియామకాలు పూర్తయితే ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా రాష్ట్రంలోనే అనకాపల్లిలోనే తొలుత నిర్మాణం చేపట్టే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ‘బూడి’ ప్రధాన లక్ష్యం నెరవేరి జిల్లా పేరు రాష్ట్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదేమో. అందరి మరిషిగా, ప్రజా నేతగా నియోజవర్గంలోనే కాకుండా ఇపుడు కేబినెట్ లోనూ ఒక కీలక భూమిక పోషించే అనకాపల్లి జిల్లా మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బూడి ముత్యాలనాయుడు అభివ్రుద్ధి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా వుంటుందనే విధంగా చేసి చూపించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగానే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు నెలల్లో కొత్త జిల్లాలో అధికారుల కూర్పు పూర్తయితే, ఇక తరువాత మొత్తం అంతా జిల్లా అభివ్రుద్ధిపైనే డిప్యూటీ సీఎం ద్రుష్టికేంద్రీకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎదురులేని నేతగా, ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న బూడి, తన మార్కును నూతన జిల్లా అనకాపల్లి జిల్లాపై అదే స్థాయిలో చూపించి సరికొత్త రీతిలో అభివ్రుద్ధి చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు..!