తిరుమలలో ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని వైభవంగా నిర్వహిం చేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారు లను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఉదయం హనుమజ్జ యంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలోని ఆకాశగంగ వద్ద, జాపాలీ తీర్థం, నాదనీరాజనం వేదిక, ఎస్వీ వేద పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ ఉత్సవానికి సంబంధించి ఆకట్టుకునేలా ప్రోమో రూపొందించాలని కోరారు.
నాదనీరాజనం వేదికపై నిర్వహించే ప్రవచనాలకు సంబంధించి ఆచార్య రాణి సదాశివమూర్తి, డా. ఆకెళ్ల విభీషణశర్మ, పవనకుమార శర్మ తదితర పండితులను భాగస్వాములను చేయాలన్నారు. అంజనాద్రి వైభవం, ఇతిహాస హనుమద్విజయం, యోగాంజనేయం, వీరాంజనేయం, భక్తాంజనేయం పలు అంశాలపై ప్రవచనాలు ఉంటాయన్నారు. ఏర్పాట్లకు సంబంధించి ఇంజినీరింగ్, అన్నదానం, ధర్మప్రచార పరిషత్, ఎస్వీ వేద పాఠశాల, భద్రతా విభాగం, పిఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, డిఇ రవిశంకర్‌రెడ్డి, విజివో బాలిరెడ్డి, పండితులు ఆచార్య రాణి సదాశివమూర్తి, డా. ఆకెళ్ల విభీషణశర్మ, కుప్పా విశ్వనాథశర్మ తదితరులు పాల్గొన్నారు.