తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కొలువులో 19 నెలల పాటు భక్తులకు సేవలు అందించానని, దీన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డికి టిటిడి ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డిని శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటంతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ తన పదవీ కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పలు కార్యక్రమాలు ఇంకా పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత బోర్డుతోపాటు రానున్న ఈఓ ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తన పదవీ కాలంలో సహకరించిన ధర్మకర్తల మండలికి, టిటిడి అధికారులకు, ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం టిటిడి ఈవో(ఎఫ్ఎసి) ఎవి.ధర్మారెడ్డి టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. జెఈఓ(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని జెఈఓ అందించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో(ఎఫ్ఎసి) ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల పాటు తాను అదనపు ఈఓగా బాధ్యతలు నిర్వహించానని, శ్రీవారి ఆశీస్సులతో ఈవో(ఎఫ్ఎసి) బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో నరసింహ కిషోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వర రావు, ఎస్ఈ జగదీశ్వర రెడ్డి, అడిషనల్ సీవీఎస్వో శివ కుమార్ రెడ్డి డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, హరీంద్ర నాథ్ , కస్తూరి బాయి, భాస్కర్, హెల్త్ ఆఫీసర్ Dr. శ్రీ దేవి, పేష్కార్లు శ్రీహరి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.